India Pakistan Conflict: భారత్, పాక్ కాల్పుల విరమణతో ఇప్పుడేం జరగబోతోంది.. సింధూ జలాలపై మోదీ బిగ్ డెసిషన్.!

కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో సింధూ జలాల నిలిపివేతపై భారత్ ప్రభుత్వం ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

Indus Water Treaty

India Pakistan Conflict: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రముఠాలకు గట్టి చావుదెబ్బ తగిలింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం గురిపెట్టి దాడులు చేసింది. దీంతో 100మందికిపైగా ఉగ్రవాదులు మరణించారు. వీరిలో జేషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాదులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్.. భారత్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే, ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణ పై ప్రకటన చేశాయి. భూతల, గగనతల, సాగర జలాల్లో అన్నిరకాల కాల్పులు, సైనిక చర్యలను రెండు దేశాలు నిలిపేశాయి. ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అయితే, సింధూ జలాల ఒప్పందంపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ ఆసక్తికరంగా మారింది.

Also Read: Pak PM Sharif : భారత్‌తో కాల్పుల విరమణ.. ట్రంప్‌కు పాక్ ప్రధాని షరీఫ్ కృతజ్ఞతలు..

పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఆధారాలతో నిర్ధారణకు వచ్చిన భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్ ను అన్నివైపుల నుంచి దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో సింధూ జలాల ఒప్పందంను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఆ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ నీటిపై వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం ఆధారపడి ఉంది. ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా ఉన్న ప్రపంచ బ్యాంకు సైతం సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతపై భారత్ తీసుకున్న నిర్ణయంలో మేము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

Also Read: Nagrota Army Station : జమ్మూలో హై అలర్ట్.. నగ్రోటాలో ఆర్మీ యూనిట్‌పై కాల్పులు.. భారత జవాన్‌కు గాయాలు..!

కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో సింధూ జలాల నిలిపివేతపై భారత్ ప్రభుత్వం ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ సింధూ జలాల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ఉద్దేశంలోలేరని తెలుస్తోంది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలన్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. సింధూ జలాలను పాకిస్థాన్ కు వెళ్లనివ్వరాదన్న నిర్ణయాన్ని సడలించేది లేదని తెలిపాయి. అయితే, ఇరు దేశాల మధ్య రెండుమూడు రోజుల్లో జరగబోయే చర్చల్లో సింధూ జలాల ఒప్పందాన్ని కొనసాగించేలా పాకిస్థాన్ గట్టిగా పట్టుబడితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. పాకిస్థాన్ కు ఎలాంటి షరతులు విధిస్తుందనేది వేచి చూడాల్సిందే.