వ్యూహాత్మకంగా ప్రియాంక గాంధీ అడుగులు.. అక్కడ గెలిస్తే కాంగ్రెస్‌కు పునర్ వైభవం ఖాయమా?

ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న సందర్భం ప్రత్యేకమైనదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ విఫలమైన నాయకుడన్న ప్రచారం జరిగినప్పుడు ప్రియాంకకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.... ప్రియాంకపై అంచనాల భారం అధికంగా ఉండేదని, పార్టీకి చిన్న ఓటమి ఎదురైనా... తిరిగి నిలబెట్టలేని పరిస్థితులు బీజేపీ కల్పించేదని, ప్రియాంకపైనా విఫల రాజకీయనాయకురాలన్న ముద్ర తొందరగా పడిపోయేదని విశ్లేషిస్తున్నారు.

Rahul, Priyanka Gandhi Political Strategy : 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రియాంక అతి ముఖ్యమైన వ్యక్తిగా మారారు. తొలుత తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలి, అన్న ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథిలో ప్రచార బాధ్యతలు మాత్రమే నిర్వహించిన ప్రియాంక ఆ తర్వాత ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రానికీ స్టార్ క్యాంపెయిన్‌గా మారారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంక… నెమ్మదిగా పార్టీపై తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టారు. ఓటములు ఎదురయినప్పుడు కుంగిపోకుండా, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా పనిచేయడం ప్రారంభించారు. 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో రాహుల్ తర్వాత ప్రియాంక ప్రధాన వ్యక్తిగా మారారు. ఈ ఎన్నికల్లో అంచనాకు మించి కాంగ్రెస్, ఇండియా కూటమి రాణించడంలో రాహుల్‌తో కలిసి కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు అన్న ఖాళీచేసిన వాయనాడ్ స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

ప్రియాంక ప్రభావంపై వ్యతిరేక ప్రచారం..
అనారోగ్యం, ఇతర కారణాలతో సోనియా ప్రత్యక్ష రాజకీయాల్లో అంత చురుకైన పాత్ర పోషించలేకపోవడంతో కాంగ్రెస్ రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ ప్రవేశించాల్సిన అనివార్యత 2019 ఎన్నికలకు ముందు ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికలకు 3నెలల ముందు 2019 జనవరి 23న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక నియమితులయ్యారు. ఆ ఎన్నికల్లో ఆమె తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఆ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిచింది ఒకే ఒక సీటు. రాయబరేలి నుంచి సోనియా గెలుపొందారు. చివరకు ఆస్థాన నియోజకవర్గం అమేథి నుంచి రాహుల్ ఓటమి పాలయ్యారు. దీంతో ప్రియాంక ప్రభావంపై బీజేపీ సహా ఇతర పక్షాలు వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లు కేవలం 52.

కాంగ్రెస్‌ను కుదిపేసిన సీనియర్ల తిరుగుబాటు..
1984లో 404 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ 2019 నాటికి 52 స్థానాలకు పడిపోవడాన్ని పోలిస్తే… కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని బీజేపీ ప్రచారం చేసింది. అటు రాహుల్‌పైనా, ఇటు ప్రియాంకపైనా తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. అన్నాచెల్లెళ్లు విఫలమయ్యారన్న విశ్లేషణలు పెరిగిపోయాయి. ముఖ్యంగా రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై వ్యక్తమవుతున్న సందేహాలు మరింతగా పెరిగాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ స్వయంగా తప్పుకోవడం, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా తిరుగులేని అధికారం చెలాయించిన సీనియర్లంతా జీ 23 పేరుతో తిరుగుబాటు చేయడం కాంగ్రెస్‌ను కుదిపేసింది. ఆ సమయంలో ప్రియాంకను పార్టీ అధ్యక్షురాలిని చేయాలన్న డిమాండ్ వినిపించింది కానీ అది కార్యరూపం దాల్చలేదు.

కాంగ్రెస్‌కు ఊహించని పరాజయం..
రాహుల్ కన్నా ప్రియాంక గాంధీ మెరుగైన, సమర్థవంతమైన నాయకురాలంటూ కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో దశాబ్దాలుగా సాగుతున్న ప్రచారానికి 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో తెరపడింది. ఆ ఎన్నికల నాటికి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. రాహుల్‌తో కలిసి రాష్ట్రమంతా విస్తృత ప్రచారం నిర్వహించారు. దళితులకు అండగా నిలిచారు. అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్ కేటాయించడం ద్వారా అందరికీ అండగా నిలుస్తామన్న సంకేతం పంపారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊహించని పరాజయం ఎదురైంది.

ప్రియాంకను కాంగ్రెస్ అధ్యక్షురాలిని చేయాలన్న ప్రచారానికి తెర..
ప్రియాంక ప్రభావం ఓటర్లపై ఏ మాత్రం కనిపించ లేదు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్ గెలుచుకుంది కేవలం రెండంటే రెండు సీట్లు. 2017 ఎన్నికల కన్నా 2022 ఎన్నికల నాటికి యూపీలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారింది. అతి పెద్ద రాష్ట్రం యూపీలో కాంగ్రెస్‌కు ప్రియాంక పునర్‌ వైభవం కల్పిస్తారని, తద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయని రాజకీయ విశ్లేషకులు వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. ప్రియాంకను కాంగ్రెస్ అధ్యక్షురాలిని చేయాలన్న ప్రచారానికి అప్పటితో తెరపడింది.

కాంగ్రెస్ అస్తిత్వంపై సందేహాలు..
యూపీ ఎన్నికల్లో ఓటమి, కాంగ్రెస్ ముక్త భారత్ కోసం బీజేపీ విస్తృత ప్రయత్నాలు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాల కూల్చివేత, అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం, కొత్తగా అధికారంలోకి రాలేకపోవడం వంటి పరిస్థితులతో దేశంలో కాంగ్రెస్ మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో కొనసాగుతుందా, కాంగ్రెస్ అస్తిత్వం నిలబడుతుందా తరహా విశ్లేషణలు సాగాయి. కాంగ్రెస్ చరిత్రలోనే ఎన్నడూ ఎరగనంత క్లిష్ట పరిస్థితులున్నప్పటికీ రాహుల్, ప్రియాంక ధైర్యం వీడలేదు. పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారు.

వ్యూహాత్మకంగా అడుగులు వేసిన అన్న చెల్లెలు..
భారత్ జోడో యాత్ర మొదలుపెట్టి రాహుల్ దేశంలో ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయ నేతగా ఎదిగారు. అదే సమయంలో ప్రియాంక యూపీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. యూపీలో ఎదురైన పరాభవం, తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అదే సమయంలో కాంగ్రెస్ గాంధీ-నెహ్రూ వారసుల చేతిలో చిక్కుకుపోయిందన్న విమర్శలను తిప్పికొట్టేందుకు పార్టీ అధ్యక్ష పదవికి అన్నా చెల్లెళ్లిద్దరూ దూరంగా ఉండి తెలివిగా వ్యవహరించారు. AICC అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగి… మల్లికార్జున ఖర్గే పదవి చేపట్టడంతో… సీనియర్లకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నారన్న సంకేతాలు పార్టీ క్యాడర్‌కు అందాయి.

కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం..
ఈ పరిస్థితుల్లోనే ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఆ విజయం పార్టీకి కొత్త జవసత్వాలను అందించింది. రాహుల్ భారత్ జోడోయాత్ర ప్రభావం, ప్రియాంక విస్తృత ప్రచారం కర్ణాటకలో కాంగ్రెస్‌కు సునాయాస గెలుపు దక్కేలా చేశాయి. మరికొన్ని నెలలకు జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ రాహుల్, ప్రియాంక గాంధీ కలిసికట్టుగా పనిచేసి గెలుపు లక్ష్యాన్ని చేరుకున్నారు.

2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురయిన చేదు ఫలితాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంది కాంగ్రెస్. కొత్త, పాత పొత్తులతో ఇండియా కూటమిగా ఏర్పడి ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగింది. యూపీలో ఒంటరిగా పోటీ చేయకుండా సమాజ్‌వాదీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేయగలిగింది. యూపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో ప్రియాంక కీలకపాత్ర పోషించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సోనియాగాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక ఎన్నికల బరిలో నిలవడంపై ఊహాగానాలు మొదలయ్యాయి.

వ్యూహాత్మకంగా ప్రియాంకను పోటీకి దూరంగా ఉంచిన రాహుల్..
తొలుత తెలంగాణ లేదా కర్ణాటక నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం సాగింది. వాయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ మరోసారి ఆ స్థానంలోనే పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, ఆస్థాన నియోజకవర్గాలు రాయబరేలి లేదా అమేథి నుంచి ప్రియాంక పోటీ చేస్తారని భావించారు. చివరి నిమిషం దాకా రాయబరేలి, అమేథి స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆ రెండు స్థానాలను అన్నాచెల్లెళ్ల కోసమే ఖాళీగా ఉంచారని ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమేథి స్థానాన్ని గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్‌ శర్మకు కేటాయించిన కాంగ్రెస్… రాయబరేలి నుంచి అనూహ్యంగా రాహుల్‌ను బరిలోకి దింపింది. ఇది కాంగ్రెస్ వర్గాలను సైతం విస్మయ పరిచింది.

అయితే ఆ ఎన్నికల్లో పోటీకి ప్రియాంకను దూరంగా ఉంచడం వల్ల కాంగ్రెస్‌కు మంచే జరిగిందన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. రాయబరేలి బరిలో ప్రియాంక నిలిస్తే…. వారసత్వ రాజకీయాలంటూ విమర్శలు చేయడానికి బీజేపీకి స్వయంగా అవకాశం కల్పించినట్టవుతుందన్న అభిప్రాయంతో రాహుల్ వ్యూహాత్మకంగా ఆమెను పోటీకి దూరంగా ఉంచారు.

ఈ ఎన్నికలతో రాహుల్ నాయకత్వ సామర్థ్యం నిరూపితమైంది..
ఎన్నికల్లో కాంగ్రెస్, ఇండియా కూటమి ఊహించిన దానికన్నా మెరుగైన ఫలితాలు సాధించింది. సొంతంగా 99 స్థానాలు సాధించడం ద్వారా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని బలమైన స్థితిలో ఉంచారు. స్వయంగా వాయనాడ్, రాయబరేలి స్థానాల నుంచి 3లక్షలకు పైగా మెజార్టీతో ఘనవిజయం సాధించారు. పొత్తుల విషయంలోనూ, సీట్లు త్యాగం చేయడంలోనూ రాహుల్ తీసుకున్న నిర్ణయాలు ఇండియా కూటమి బలపడడానికి కారణమయ్యాయి. కూటమిని అధికారంలోకి తీసుకురాలేనప్పటికీ ఈ ఎన్నికలతో రాహుల్ నాయకత్వ సామర్థ్యం నిరూపితమైంది.

గెలిస్తే.. దక్షిణాదిన కాంగ్రెస్ బాధ్యతలు మొత్తం ప్రియాంకకు అప్పగిస్తారన్న ప్రచారం..
దేశ రాజకీయాల్లో మోదీకి ప్రత్యామ్నాయ నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల ప్రక్రియ ముగిసిన దగ్గరి నుంచి రాహుల్ ప్రియాంక పోటీపై మాట్లాడుతున్నారు. వారణాసిలో ప్రియాంక పోటీ చేసుంటే ప్రధాని మోదీ ఓడిపోయి ఉండేవారని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 14 రోజుల్లోపు రెండు స్థానాల్లో ఒకదానికి రాజీనామా చేయాలన్న నిబంధన ఉండడంతో రాహుల్ స్థానంలో వాయనాడ్ నుంచి ప్రియాంకను బరిలో దించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఉత్తర భారత దేశంలో యూపీ నుంచి రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తే.. ప్రియాంక వాయనాడ్‌లో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెడితే.. దక్షిణ భారతదేశం నుంచి ఆమె కాంగ్రెస్ ప్రతినిధిగా ఉంటారు. వాయనాడ్ ఎన్నికల్లో గెలుపొందితే.. దక్షిణాదిన కాంగ్రెస్ బాధ్యతలు మొత్తం ప్రియాంకకు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది.

ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న సందర్భం ప్రత్యేకమైనదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ విఫలమైన నాయకుడన్న ప్రచారం జరిగినప్పుడు ప్రియాంకకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే…. ప్రియాంకపై అంచనాల భారం అధికంగా ఉండేదని, పార్టీకి చిన్న ఓటమి ఎదురైనా… తిరిగి నిలబెట్టలేని పరిస్థితులు బీజేపీ కల్పించేదని, ప్రియాంకపైనా విఫల రాజకీయనాయకురాలన్న ముద్ర తొందరగా పడిపోయేదని విశ్లేషిస్తున్నారు. అలా కాకుండా పార్టీలో రాహుల్ గాంధీ అత్యంత శక్తిమంతమైన నేతగా మారిన తర్వాత ప్రియాంకను పార్టీ వ్యవహారాల్లో, ఎన్నికల రాజకీయాల్లోనూ కీలకంగా మార్చడం ద్వారా అన్నాచెల్లెళ్లు కలిసికట్టుగా, సమర్థవంతంగా పనిచేసి 2029నాటికి కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా పటిష్టస్థితిలో నిలిపేందుకు అవకాశం ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ వ్యూహాత్మకంగా, తెలివిగా తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ రాహుల్, ప్రియాంక మధ్య విభేదాలు సృష్టించి.. పార్టీలో తమకు ప్రాధాన్యత పెంచుకోవాలనుకున్న అంతర్గత శత్రువులకు, దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ను అంతర్థానం చేయాలని కుట్రపన్నిన బయటి ప్రత్యర్థులకు చెంపపెట్టని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రియాంక గెలిస్తే.. తొలిసారి గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్‌లో ఉన్నట్టవుతుంది. సోనియా రాజ్యసభ ఎంపీగా ఉండగా, రాహుల్ రాయబరేలి ఎంపీగా కొనసాగుతారు. మొత్తంగా ఈ పరిణామాలన్నీ పునర్‌ వైభవం దిశగా కాంగ్రెస్ వేస్తున్న అడుగులని ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భావిస్తున్నారు.

Also Read : కాంగ్రెస్ కార్యకర్తల రెండున్నర దశాబ్దాల ఎదురుచూపులకు తెర..! ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ

ట్రెండింగ్ వార్తలు