కాంగ్రెస్ కార్యకర్తల రెండున్నర దశాబ్దాల ఎదురుచూపులకు తెర..! ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ మద్దతుదారులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రియాంకగాంధీ లోక్‌సభలో ప్రవేశించే తరుణం ఆసన్నమైంది.

కాంగ్రెస్ కార్యకర్తల రెండున్నర దశాబ్దాల ఎదురుచూపులకు తెర..! ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Political Entry : ఘనమైన కుటుంబ నేపథ్యం, నాయనమ్మను గుర్తుకుతెచ్చే రూపం, భారతదేశపు ఉక్కు మహిళకు అసలు వారసురాలిగా ప్రచారం, దేశంలోనే అత్యంత పురాతన పార్టీకి పునరుత్తేజం కల్పించే శక్తి ఉన్న నాయకురాలన్న అంచనాలు, తల్లి నుంచి సహజంగా వచ్చిన పట్టుదల, సంక్షోభాలను పరిష్కరించగల నేర్పు, చూడగానే ఆకట్టుకునే అందం, వేగంగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం, రాజకీయ వ్యూహాలు రచించడంలో చాణక్యం, ప్రజాకర్షణ, అసాధారణ తెలివితేటలు….

గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దిగుతున్న ఐదోతరం వారసురాలు ప్రియాంకగాంధీపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే కాక ప్రజలందరిలో ఉన్న అభిప్రాయం. హస్తం పార్టీ నేతలు, కార్యకర్తల రెండున్నర దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. కాంగ్రెస్ మద్దతుదారులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రియాంకగాంధీ లోక్‌సభలో ప్రవేశించే తరుణం ఆసన్నమైంది.

ప్రియాంక రాజకీయ ప్రవేశంపై రాజీవ్ హయాంలోనే అనేక ఊహాగానాలు..
గాంధీ-నెహ్రూ కుటుంబంలో ప్రియాంక గాంధీపై తొలి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం నుంచే…ప్రియాంకను నాయనమ్మ ఇందిరాగాంధీతో పోల్చే వారు కాంగ్రెస్ నేతలు. ఇందిరాగాంధీ లక్షణాలను మనమరాలు ప్రియాంక పుణికి పుచ్చుకున్నారని, నాయనమ్మ వారసత్వాన్ని కొనసాగించేది ప్రియాంకేనని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగేది. ప్రియాంక రాజకీయ ప్రవేశంపై రాజీవ్ హయాంలోనే అనేక ఊహాగానాలు వెలువడుతుండేవి. కాంగ్రెస్ కార్యకర్తల్లోనే కాక, దేశమంతా ప్రియాంకగాంధీపై సానుకూల అభిప్రాయం, భారీ అంచనాలు ఉండేవి.

రాజీవ్ గాంధీ మరణం తర్వాత సోనియా కుటుంబం కొన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ…. ప్రియాంకది అప్పటికి చిన్న వయసే అయినప్పటికీ.. ఆమెను కాంగ్రెస్ రాజకీయాల్లో భాగం చేయాలనే డిమాండ్ పార్టీ కార్యకర్తల నుంచి తరచూ వినిపిస్తుండేది. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాభవం మూటగట్టుకోవడంతో..ఆ తర్వాత ఈ డిమాండ్ మరింత పెరిగింది.

విదేశీయురాలు అన్న ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు..
రాజీవ్ గాంధీ భార్యగా…గాంధీ-నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ…1997లో సోనియాగాంధీ రాజకీయ ప్రవేశం చేశారు. ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆశించిన ఫలితాలు రానప్పుడల్లా…..ప్రియాంకను పార్టీలోకి తీసుకోవాలన్న ప్రతిపాదన తెరపైకి వస్తుండేది. కానీ అప్పుడు ప్రియాంక వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉండేవారు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతల్లో తలమునకలై ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్యే 2004 ఎన్నికల్లో తొలిసారి ప్రియాంక భారత రాజకీయ చిత్రపటంపై కనిపించారు. రాయబరేలి నుంచి పోటీచేస్తున్న తల్లి సోనియా గాంధీ, అమేథీ నుంచి పోటీచేస్తున్న సోదరుడు రాహుల్‌గాంధీకి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. సోనియాపై అప్పటి బీజేపీ నేతలు చేసిన విదేశీయురాలు అన్న ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. విదేశీయురాలి బిడ్డల్లా కనిపిస్తున్నామా? అంటూ ప్రతిపక్షాలను నిలదీశారు.

తల్లి సూచనతో క్రియాశీల రాజకీయాలకు దూరం..
రాహుల్‌గాంధీని తండ్రి రాజీవ్‌గాంధీతో పోలుస్తూ.. కాంగ్రెస్ భవిష్యత్ నాయకుడు ఆయనేనన్న సందేశాన్ని అందించారు. ఆ ఎన్నికల్లో ఊహించని విధంగా జాతీయస్థాయిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిల్చి.. తన నేతృత్వంలో యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పటినుంచి ప్రియాంక కాంగ్రెస్ రాజకీయాల్లోనే భాగంగా కనిపిస్తున్నప్పటికీ ఆమె పార్టీలో ప్రత్యేక పదవి ఏమీ చేపట్టలేదు. రాహుల్ గాంధీలా…. ఎన్నికల్లో పోటీచేసి… కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు స్వీకరించాలన్న ఆలోచన ప్రియాంకగాంధీకి ఉన్నప్పటికీ…. పిల్లల సంరక్షణ కోసం కొన్నాళ్లు ప్రియాంక ఇంటికే పరిమితం కావాలని సోనియా వారించినట్టు ప్రచారం జరిగింది. తల్లి సోనియా సూచనతో ప్రియాంక కొంత కాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

అప్పటి నుంచి కాంగ్రెస్ ముఖచిత్రంగా మారిపోయారు..
2004లో రాహుల్ గాంధీ రాజకీయప్రవేశం చేయడం, అమేథీ నుంచి ఆయన తొలిసారే అద్భుత విజయం సాధించడం, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో…ఇక అందరి దృష్టి రాహుల్ గాంధీపైనే పడింది. గాంధీ-నెహ్రూ కుటుంబ వారసుడిగా రాహుల్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ తరఫున భావి ప్రధానిగా రాహుల్‌పై అంచనాలు పెరిగిపోయాయి. అసలు 2004లో రాహుల్ రాజకీయప్రవేశం చేసినప్పటి నుంచి…. దేశవ్యాప్తంగా ఆయన కాంగ్రెస్ ముఖచిత్రంగా మారిపోయారు. పార్టీలో రాహుల్ తన మార్క్ చూపించడం ప్రారంభించారు. వృద్ధులతో నిండిపోయిన పార్టీగా ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్‌ను ఆ ఇమేజ్‌కు దూరంగా జరిపేందుకు… యువశక్తికి పెద్దపీట వేశారు.

కీలక నిర్ణయాలన్నీ రాహుల్ తీసుకునే వారు..
కాంగ్రెస్ గత వైఖరికి భిన్నంగా రాజకీయాలు చేయడం ద్వారా ఆ పార్టీని తొలి నుంచీ తీవ్రంగా వ్యతిరేకించే వారిలో సైతం సానుకూల అభిప్రాయం పెంపొందేలా చేశారు. కుటుంబ పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్‌ను కొత్త, పాతతరం నేతల మేలు కలయికగా మార్చారు. ఆ పరిస్థితుల్లో 2009 తర్వాత రాహుల్ గాంధీ దేశ ప్రధాని బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగినప్పటికీ…ఆయన పదవికి దూరంగానే ఉన్నారు. సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ… కీలక నిర్ణయాలన్నీ రాహుల్ తీసుకునేవారన్న ప్రచారం జరిగింది. అలా 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్‌ను కొత్త తరానికి దగ్గర చేసినప్పటికీ.. వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడం, నరేంద్రమోదీ మానియా ప్రభావంతో ఆ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైంది. కేవలం 44 స్థానాలకు పరిమితమైంది.

ప్రియాంకకు పార్టీలో కీలక పదవి కట్టబెట్టాలన్న డిమాండ్..
2014లో కాంగ్రెస్ ఓటమి తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. మరోసారి ప్రియాంక రాజకీయ ప్రవేశంపై చర్చ బయలుదేరింది. రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌ను నడిపించే శక్తిసామర్థ్యాలు లేవని, ప్రియాంకకు పార్టీలో కీలక పదవి కట్టబెట్టాలన్న డిమాండ్ వినిపించసాగింది. కాంగ్రెస్ అంతర్గతంగా ఈ చర్చ సాగుతుండగానే.. సోనియా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో పార్టీ వ్యవహారాల పూర్తి బాధ్యత రాహుల్ చేపట్టాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మారి పార్టీపై రాహుల్ పూర్తిస్థాయి పట్టు సాధించారు. 2014దాకా క్యాంపెయిన్ స్టార్‌గా మాత్రమే ఉన్న ప్రియాంక నెమ్మదిగా పార్టీ కార్యకలాపాల్లో భాగమవ్వడం మొదలైంది.

తన రాజకీయ చాణక్యంతో బీజేపీని దెబ్బకొట్టిన ప్రియాంక..
సహజంగా ఉన్న ప్రజాకర్షణకు తోడు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రియాంక కొద్దికాలంలోనే పార్టీ క్యాడర్ నమ్మకం పొందగలిగారు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ…. జేడీఎస్‌ను తమవైపుకు తిప్పుకుని, ముఖ్యమంత్రి పదవి త్యాగం చేసి మరీ కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పాటు చేయడంలో ప్రియాంక కీలకపాత్ర పోషించారు. సీఎం పదవి కోసం పట్టుబట్టకుండా కుమారస్వామికే ఆ పీఠం కట్టబెట్టడం ద్వారా.. బీజేపీ పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడంలో రాజకీయచాణక్యత ప్రదర్శించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో ప్రియాంక పాత్ర క్రమంగా పెరుగుతూ వచ్చింది.

Also Read : ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా? ఇది సాధ్యమేనా? భారత్‌లో భారీ దుమారం రేపిన ఎలాన్ మస్క్ ట్వీట్