Warangal : వామ్మో.. ఇదేం ట్విస్ట్‌రా మామ.. పెళ్లి చేసుకొని బిగ్ షాకిచ్చిన మహిళ.. పేరెంట్స్, బంధువులంతా ఫేకే.. ట్విస్టుల మీద ట్విస్టులు
Warangal : యువకుడికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్న ఓ మహిళ నెల రోజులు తిరగకముందే నగలు, డబ్బుతో పరారైంది.
Warangal
Warangal : యువకుడికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్న ఓ మహిళ నెల రోజులు తిరగకముందే నగలు, డబ్బుతో పరారైంది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ యువతి గతంలోనూ పలువురిని వివాహం చేసుకొని డబ్బుతో ఉడాయించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి యువతి పరిచయమైంది. గత అక్టోబరు నెలాఖరులో వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కొద్దిరోజులకే హనుమకొండలో గది అద్దెకు తీసుకొని వరుడు, వధువు ఉంటున్నారు. వారం రోజుల కిందట పెళ్లి సందర్భంగా పెట్టిన బంగారం, కొంత డబ్బును ఇంట్లో పెట్టగా.. మహిళ వాటిని తీసుకొని పరారైంది. అయితే, పరువు పోతుందని బాధిత కుటుంబం సైలెంట్ గా ఉందని తెలుస్తుంది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అయితే, పెళ్లిచేసుకొని డబ్బు, బంగారంతో పారిపోయిన మహిళ గతంలోనూ పలు వివాహాలు చేసుకొని నగలు, డబ్బుతో ఉడాయిస్తూ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సదరు మహిళకు 13ఏళ్ల కుమార్తె కూడా ఉందని, అయినప్పటికీ ఆమె డబ్బు, నగల కోసం తనకు పెళ్లి కాలేదంటూ యువకులతో పరిచయం పెంచుకొని.. వారిని పెళ్లి చేసుకొని మోసాలకు పాల్పడిందని తెలిసింది. తాజాగా.. పర్వతగిరి మండలంలో వివాహం సందర్భంగా ఆ మహిళ తరపున ఆమె తల్లిదండ్రులు, బంధువులు పాల్గొన్నారు. అయితే, వారి గురించి ఆరాతీయగా.. వారంతా ఫేక్ అని వరుడు కుటుంబం గుర్తించింది.
మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ అప్‌లోడ్ చేసి అమాయకులను మోసం చేస్తున్న మహిళది విజయవాడగా గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ యువతిని గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
