Shivraj Singh Chouhan: ఇండియా ప్రపంచకప్ ఓడిపోతే వారిద్దరూ సంతోషించారు

వన్డే ప్రపంచకప్ ముగిసిపోయి దాదాపు వారం కావొస్తున్నా టీమిండియాపై ఓటమిపై రాజకీయ నాయకుల వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు. టీమిండియా ఓటమికి మీరు కారణమంటే మీరు కారణమని ఒకరిపై ఒకరు కమెంట్స్ చేస్తున్నారు.

Shivraj Singh Chouhan: ఐసీసీ వన్డే ప్రపంచకప్ గత వారమే ముగిసింది. ఫైనల్లో తలపడిన టీమిండియా, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కూడా ఆడేస్తున్నాయి. అయితే ప్రపంచకప్‌పై పొలిటికల్ లీడర్ల కమెంట్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రపంచకప్ ప్రస్తావన తెచ్చారు. రాజస్థాన్‌లో బీజేపీ తరపున గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియా ఓడిపోతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంతోషించారని సీఎం చౌహాన్ అన్నారు.

అహ్మదాబాద్‌లోజరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. మన జట్టు విజయం సాధించాలని దేశం మొత్తం కోరుకుంది. తుదిపోరులో మన టీమ్ ఓడిపోవడంతో అందరూ బాధపడ్డారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రం సంతోషించారు. వీరిద్దరి వల్ల కాంగ్రెస్ పార్టీకే కాదు, దేశానికీ నష్టమే. దేశాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. అశోక్ గెహ్లట్ అవినీతిపరుడు. రాజస్థాన్ ను అవినీతిలో నంబర్ 1గా నిలిపారు అంటూ విమర్శించారు.

ప్రపంచకప్‌.. రాజకీయ నేతల దంగల్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అసోం సీఎం హిమంత బిస్వశర్మ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా ప్రపంచకప్‌పై రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ జయంతి రోజునే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం వల్లే టీమిండియా ఓడిపోయిందని అసోం సీఎం అన్నారు. గాంధీ కుటుంబ సభ్యుల పుట్టినరోజు నాడు టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించొద్దని బీసీసీఐని కోరారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్‌లో పెట్టడం వల్లే మన జట్టు ఓడిపోయిందని, లక్నోలో నిర్వహించివుంటే టీమిండియా గెలిచేదని అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. కోల్‌క‌తా లేదా ముంబైలో ఫైనల్ పెట్టివుంటే టీమిండియా వ‌ర‌ల్డ్‌క‌ప్‌ గెలిచేదని మమతా బెనర్జీ అన్నారు. క్రికెట్ జట్టును కాషాయికరణ చేయడానికి మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని, టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో ధరించే జెర్సీలను కాషాయ రంగులోకి మార్చారని ఆమె ఆరోపించారు.

కాగా, నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నిన్నటి నుంచి మొదలయింది. విశాఖపట్నంలో గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 2 వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది. రెండో మ్యాచ్ ఆదివారం తిరువనంతపురంలో జరుగుతుంది.

Also Read: ఫైనల్లో టీమిండియా ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ వింత వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు

ట్రెండింగ్ వార్తలు