జనరల్ డయ్యర్ లా మారడానికి పోలీసులకు ఎవరు అనుమతిచ్చారు?

Tejashwi on Munger incident బీహార్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్. ముంగేర్ ఫైరింగ్ ఘటనపై నితీష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ముంగెర్ లో పోలీసులు జరిపిన కాల్పులను తాము ఖండిస్తున్నామన్నారు.



కాగా, ముంగేర్ లో సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో దుర్గాదేవి విగ్రహాన్ని 32 మంది వ్యక్తులు నిమజ్జనం కోసం నది ఒడ్డుకు తీసుకువెళ్లారు. ముంగేర్ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఎన్నికల పోలింగ్ ఉందని.. నిమజ్జనం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్బంగా పోలీసులు మరియు భక్తుల మధ్య వాగ్వాదానికి దారితీసి హింసాత్మకంగా మారింది. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా..30మంది గాయపడ్డారు. ఆరుగురు ఎస్‌హెచ్‌ఓలతో సహా డజను మంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు.



అయితే,హోంశాఖను కూడా తనవద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాల్పుల సమయంలో ఏం చేస్తున్నారని తేజస్వీ ప్రశ్నించారు. ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇందులో పాత్ర ఉందన్నారు. ముంగేర్ ఘటనను 1919లో అమృత్ సర్ లో జరిగిన జలియన్ వాలాభాగ్ ఘటనతో పోల్చుతూ… ముంగేర్ లో జనరల్ డయ్యర్ కావడానికి పోలీసులకు ఎవరు అనుమతి ఇచ్చారని తేజస్వీ ప్రశ్నించారు.



దీనిపై హైకోర్టు దర్యాప్తు జరగాలని తేజస్వీ అన్నారు. మరోవైపు, ముంగేర్ ఘటనకు సంబంధించి పోలీసులు సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించడం జరుగుతోందంటూ బీహార్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు