రైతుల ఆందోళన వెనుక ఎవరున్నారు? మీడియా దర్యాప్తు చేయాలన్న కేంద్రమంత్రులు

Who’s behind farmers’ protest? Tomar, Goyal ask media to investigate వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతుల వెనక ఎవరున్నారో మీడియా కనిపెట్టాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని మీడియాకు సూచించారు. రైతులను నడిపిస్తున్న శక్తి ఏదైనా ఉందా అని జర్నలిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రులు.



మీడియా కళ్లు మరింత చురుగ్గా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించే పని మీకే వదిలేస్తున్నాం అంటూ తోమర్ వ్యాఖ్యానించారు. పీయూష్ గోయల్ సైతం ఇదే తరహా ప్రకటన చేశారు. దీనిపై మీడియా అన్వేషించాలి. దర్యాప్తు నైపుణ్యాలను ఉపయోగించాలంటూ జర్నలిస్టులకు సూచనలు చేశారు. కాగా, రైతుల ఆందోళనలు వెనుక దాయాది పాకిస్థాన్, చైనాల హస్తం ఉందంటూ కేంద్ర మంత్రి రావ్‌సాహేబ్ దాన్వే బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.



కాగా, నూతన అగ్రి చట్టాల సవరణపై పలు ప్రతిపాదనలతో రైతులకు ముసాయిదాను పంపించామని మంత్రులు స్పష్టం చేశారు. వీటిపై రైతులే నిర్ణయం తీసుకొని.. తర్వాతి విడత చర్చలకు తేదీ నిర్ణయించాలని తెలిపారు. తాము పంపించిన ప్రతిపాదనపై వివరణ కావాలన్నా మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.



అయితే కేంద్రం ప్రతిపాదనలను రైతులు వ్యతిరేకిస్తున్నారు. చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్​కే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. డిమాండ్​ను ఆమోదించకపోతే.. ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రైల్వే ట్రాక్‌లను దిగ్బంధిస్తామని రైతు సంఘాలు గురువారం తేల్చిచెప్పాయి. ఈ అంశంపై త్వరలోనే తేదీని వెల్లడిస్తామని తెలిపాయి. ఢిల్లీ సింఘూ సరిహద్దు వద్ద కూడా ఆందోళనను తీవ్రతరం చేస్తామని, దేశ రాజధానికి వెళ్లే అన్ని రహదారులను అడ్డుకోవడం ప్రారంభిస్తామని పునరుద్ఘాటించాయి.



వ్యవసాయ చట్టాలపై చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, తక్షణమే రైతులు నిరసనలు విరమించి.. కేంద్రం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రైతు సంఘాలు ఈ తాజా హెచ్చరికలు చేశాయి.