మీకిది న్యాయమేనా? జగ్గీ వాసుదేవ్‌ని ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు.. అసలేం జరిగిందంటే..

ఈ కేసు విచారణ సందర్భంగా.. తమకు మరిన్ని సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తుల బెంచ్ వ్యాఖ్యానించింది.

Jaggi Vasudev (Photo Credit : Google)

Jaggi Vasudev : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసు విషయంలో ఆయనపై సీరియస్ అయ్యింది. ఇంతకీ హైకోర్టు ఏమందంటే.. ”ఇషా ఫౌండేషన్‌కు చెందిన జగ్గీ వాసుదేవ్ అలియాస్ సద్గురు తన కుమార్తెకు వివాహం చేసి, ఆమె జీవితంలో బాగా స్థిరపడేలా చూశారు. కానీ, ఇతరు యువతుల విషయానికి వస్తే గుండు చేయించుకుని, ప్రాపంచిక జీవితాన్ని త్యజించి, తన యోగా కేంద్రాలలో సన్యాసులుగా జీవించమని ఆయన ఎందుకు ప్రోత్సహిస్తున్నారు” అని న్యాయమూర్తులు ఎస్.ఎం సుబ్రమణియన్, వి.శివజ్ఞానం బెంచ్ ప్రశ్నించింది.

కోయంబత్తూరులోని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ (69) దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ ప్రశ్న వేశారు. తన ఇద్దరు కుమార్తెలు (42, 39 సంవత్సరాల వయసు) ఇషా యోగా కేంద్రంలో శాశ్వతంగా ఉండేలా బ్రెయిన్ వాష్” చేయబడ్డారని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా.. న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు.
”వాసుదేవ్ తన కూతురికి పెళ్లి చేసి, జీవితంలో బాగా స్థిరపడేలా చేశారు. కానీ, ఇతర మహిళలను తమ భౌతిక జీవితాన్ని త్యజించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు” అంటూ తీవ్ర సందేహాలను వ్యక్తం చేశారు.

ఇషా యోగా సెంటర్ లో శాశ్వతంగా ఉండిపోయేలా తన కూతుళ్లకు బ్రెయిన్ వాష్ చేయడమే కాకుండా.. ఫౌండేషన్‌లోని అధికారులు తమ పిల్లలతో ఎలాంటి సంబంధాలు కొనసాగించడానికి అనుమతించలేదని కోర్టుకు తెలిపారు పిటిషనర్. ఇది చాలా అన్యాయం అని ఆయన వాపోయారు. అంతేకాదు ఇషా ఫౌండేషన్‌పై పెండింగ్‌లో ఉన్న అనేక క్రిమినల్, లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తన ఆరోపణలను కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కేసుకు సంబంధించి ఆ ఇద్దరు మహిళలు కూడా కోర్టుకు హాజరయ్యారు. తాము ఫౌండేషన్‌లో ఇష్టపూర్వకంగా ఉన్నామని, అక్కడ ఉండమని ఎవరూ బలవంతం చేయడం లేదని వారు చెప్పగా, న్యాయమూర్తులు తమ ఛాంబర్‌లో వారితో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.

ఈ కేసు విచారణ సందర్భంగా.. తమకు మరిన్ని సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తుల బెంచ్ వ్యాఖ్యానించింది. తన సొంత కూతురికి జగ్గీ వాసుదేవ్ వివాహం చేశారు, జీవితంలో ఆమె బాగా స్థిరపడేలా చూశారు, మరి ఇతర మహిళలను ప్రాపంచిక జీవితాన్ని త్యజించమని జగ్గీ వాసుదేవ్ ఎందుకు ప్రోత్సహించారని ఇషా ఫౌండేషన్ తరపున న్యాయవాదిని ప్రశ్నించారు న్యాయమూర్తులు. అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. కాగా, జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఇషా ఫౌండేషన్‌పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది మద్రాస్ హైకోర్టు.

Also Read : ఆ 30వేల మంది భారతీయులు ఏమయ్యారు? ఆందోళనకు గురిచేస్తున్న సైబర్ స్లేవరీ..