Wife Saves Husband : నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ అమ్మా.. 40 అడుగుల బావిలో పడ్డ భర్తను కాపాడుకున్న భార్య.. ఎలాగో తెలిస్తే గూస్ బంప్సే..

ప్రమాదం సమయంలో ఎంతో స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి, ప్రాణాలకు తెగించి తన భ‌ర్త‌ను భార్య కాపాడుకున్న వైనంపై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది.

Wife Saves Husband : ప్రమాదం సమయంలోనూ ఆమె గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్తను సురక్షితంగా కాపాడుకుంది. తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిసినా వెనకడుగు వేయలేదు. ఎంతో రిస్క్ చేసి మరీ భర్తను రక్షించుకుంది. 40 అడుగుల లోతు బావిలో పడిపోయిన తన భర్తను ఆమె సేఫ్ గా బయటకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యింది.

ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన భర్త రమేశన్..
కేర‌ళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా పిర‌వ‌మ్ లో జరిగిందీ ఘ‌ట‌న. రమేశన్ వయసు 64 సంవత్సరాలు. అతడి భార్య పద్మ. ఆమె వయసు 54 ఏళ్లు. బుధ‌వారం ఉద‌యం త‌మ పెర‌ట్లోని మిరియాల చెట్టు ఎక్కాడు రమేశ‌న్. మిరియాలు కోస్తుండగా ఊహించని ప్ర‌మాద‌ం జరిగింది. ప్రమావ‌శాత్తు కొమ్మ విరిగిపోయింది. అంతే, ప‌క్కనే ఉన్న 40 అడుగుల లోతైన బావిలో రమేశన్ ప‌డిపోయాడు.

విపత్కర పరిస్థితుల్లోనూ నిబ్బరం కోల్పోకుండా స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించింది..
అది చూసిన భార్య ప‌ద్మ ఒక్కసారిగా షాక్ కి గురైంది. అయితే, ఆమె కంగారు పడిపోలేదు. తన ధైర్యాన్ని కోల్పోలేదు. విపత్కర పరిస్థితుల్లోనూ నిబ్బరం కోల్పోకుండా ఎంతో స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించింది. బావిలో వెలుతురు సరిగా లేదు.

దాంతో భర్త ఎక్కడున్నాడో ఆమెకు కనిపించలేదు. దీంతో ఆమె సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తాడు సాయంతో బావిలోకి దిగేసింది. అప్ప‌టికే నీళ్లలో మునిగి స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న భ‌ర్త‌ను ఆమె ఒడిసిపట్టుకుంది. అలా 20 నిమిషాలు గడిచిపోయాయి. ఎవరైనా సాయం చేయండి అంటూ పైకి వినిపించేలా గ‌ట్టిగా కేక‌లు వేయడం ప్రారంభించింది పద్మ.

భారీ వలల సాయంతో భార్య, భర్తను బయటకు తీశారు..
ఈ కేకలు విన్న‌ అటుగా వెళ్తున్న జనం ప‌రుగు పరుగున బావి వద్దకు వచ్చారు. అందులో భార్య, భర్తలు ఉన్నారని తెలుసుకుని షాక్ కి గురయ్యారు. వారు వెంటనే సాయం కోసం అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. స్పాట్ కి చేరుకున్న ఫైర్ సిబ్బంది భారీ వ‌ల‌ల సాయంతో భార్య, భర్తను సురక్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. ముందుగా భర్తను బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత భార్యను బావి నుంచి బయటకు తీశారు. ఇలా ఇద్దరూ సేఫ్ గా బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కాగా, ప్రమాదం సమయంలో ఎంతో స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి, ప్రాణాలకు తెగించి తన భ‌ర్త‌ను భార్య కాపాడుకున్న వైనంపై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది. పద్మ గుండె ధైర్యానికి స్థానికులు, నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిజంగా.. నువ్వు చాలా గ్రేట్ అమ్మా అంటూ కితాబిస్తున్నారు.