×
Ad

Wild Elephant: కెమెరాను చూసి రెచ్చిపోయిన ఏనుగు.. ఏం చేసిందంటే..

ఈ వీడియో వైరల్ అవడంతో సోషల్ మీడియా యూజర్లు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు.

Elephant Viral Video Representative Image (Image Credit To Original Source)

  • కెమెరాను చూసి కోపంతో ఊగిపోయిన ఏనుగు
  • తొండంతో కెమెరాను విసిరికొట్టిన గజరాజు
  • మరోసారి బయటపడ్డ ఏనుగు తెలివితేటలు

Wild Elephant: ఈ గ్రహం మీద అత్యంత తెలివైన జంతువులలో ఒకటి ఏనుగు. ఇవి పరిసరాలపై బలమైన అవగాహన కలిగి ఉంటాయి. తాజాగా ఓ గజరాజు చేసిన పని వాటి తెలివి తేటలను హైలైట్ చేసింది. తన వ్యక్తిగత స్థలంలోకి మనుషులే కాదు.. రికార్డింగ్ పరికరాలు చొరబడినా అవి ఊరుకోవు. తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తాయి.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేసిన 28 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ నేషనల్ పార్క్ లో జంతువుల గణన కోసం అధికారులు కెమెరాను బిగించారు. అటుగా వచ్చిన ఓ ఏనుగు ఆ కెమెరాను చూసింది. తన ఆవాసంలో ఇది కొత్తగా అనిపించడంతో ఆ ఏనుగు కోపంతో ఊగిపోయింది. తొండంతో దాన్ని పెకిలించి పక్కన పడేసింది. కెమెరా నేలపై పడిపోయిన తర్వాత ఆ ఏనుగు తన పని పూర్తి చేసుకుని ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ కెమెరా ధ్వంసం కాకపోవడంతో ఈ దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ పర్వీన్ షేర్ చేశారు.

మనుషులకే కాదు జంతువులకూ ప్రైవసీ అవసరమే..

”మనుషులకే కాదు జంతువులకు కూడా గోప్యత (ప్రైవసీ) చాలా ముఖ్యం అని ఈ ఏనుగు నిరూపించింది. ఏదో అసహజ సెటప్ (కెమెరా) గమనించింది. ఆ మరుక్షణమే దాన్ని తీసివేయాలని నిర్ణయించుకుంది. ఈ గజరాజు ఎంత తెలివైనది” అంటూ కాస్వాన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. వన్యప్రాణుల గణన, అధ్యయనం కోసం నేషనల్ పార్కులో 210 ఐర్ అండ్ ఫ్లాష్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఏనుగు తన తొండంతో విసిరికొట్టినా.. కెమెరా ధ్వంసం కాకపోవడంతో.. అడవిలో జంతువు సహజ ప్రవృత్తిని ప్రదర్శించే అద్భుతమైన వీడియోను ప్రసారం చేయగలిగిందని కస్వాన్ వెల్లడించారు.

కెమెరా ధ్వంసం కాకపోవడంతో వెలుగులోకి వీడియో..

“అదృష్టవశాత్తూ ఆ కెమెరా ధ్వంసం కాలేదు. ఈ అద్భుతమైన క్లిప్‌ను తీసుకురాగలిగింది. దీంతో మేము మా ఫీల్డ్ సిబ్బందికి పరిరక్షణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో శిక్షణ ఇస్తున్నాము. మా జాతీయ ఉద్యానవనంలో 20వేల హెక్టార్లకు పైగా భూమిని కెమెరాలు కవర్ చేస్తున్నాయి” అని వన్యప్రాణి అధికారులు కెమెరాను ఉంచిన ఫోటోలను షేర్ చేస్తూ కస్వాన్ అన్నారు.

ఈ వీడియో వైరల్ అవడంతో సోషల్ మీడియా యూజర్లు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏ విషయం ఆ ఏనుగును ఇరిటేట్ చేసి ఉంటుంది, ఈ విధంగా ప్రవర్తించేలా చేసి ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. దీనిపై యూజర్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. ”ఏనుగు జాతి ఎంత తెలివైందో చూడటం నిజంగా అద్భుతం. అవి తమ తెలివితేటలు, అమాయకత్వంతో మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయి” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. “కెమెరాలోని తెల్లటి ఫ్లాష్ ఏనుగుకు చికాకు కలిగించి ఉండొచ్చు” అని మరో యూజర్ అన్నాడు. “వారు ఏనుగు ఏకాంత ప్రదేశంలో తమ కెమెరాను ఏర్పాటు చేశారు, అది దానికి నచ్చలేదు” అని ఇంకో యూజర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Also Read: కదులుతున్న కారులో 2 గంటల పాటు యువతిపై దారుణం.. 90 కి.మీ వేగంతో వెళ్తూ చివరకు బయటకు తోసేసి..