ఏన్నో ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ లో ఇప్పుడు ఏం జరుగుతోంది ? ఏఐసీసీ తాాత్కాలిక అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేసిన అనంతరం జరుగుతున్న సీడబ్ల్యూసీ వర్చువల్ మీటింగ్ హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఈ పార్టీకే చెందిన నేతలు రాసిన లేఖపై చర్చలు జరుగుతున్నాయి.
23 మంది సీనియర్లు లేఖ రాయడంపై సోనియా, రాహుల్ తప్పుబట్టినట్లు తెలుస్తోంది. సీనియర్లపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల్లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీపై నిబద్ధత లేకుండా పోయిందని, పార్టీ సీనియర్ లీడర్స్ కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్ లపై సోనియా, రాహుల్ సీరియస్ అయ్యారు. కొందరు లీడర్లు బీజేపీ ఎజెంట్లంటూ రాహుల్ వ్యాఖ్యానించడం సీనియర్లు తీవ్రంగా పరిగణించారు.
తాను బీజేపీ ఏజెంట్ అయితే..తాను వెంటనే రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతానని, సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహారాల శైలి బాగాలేకపోవడంతోనే తాము లేఖ రాయడం జరగిందన్నారు ఆజాద్. సంతకం చేసిన వారిలో ఆజాద్ కూడా ఉన్నారు.
బీజేపీతో లింకులు ఉన్నాయని రాహుల్ ఎలా మాట్లాడుతారని కపిల్ సిబాల్ నిలదీశారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశామని, తమకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీలో నెలకొన్న సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో బీజేపీకి సహాయం చేస్తున్నారని రాహుల్ అనడంపై పార్టీ సీనియర్స్ ఫైర్ అవుతున్నారు.
అయితే..లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏమిటని సోనియా, రాహుల్ ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.