బైక్ మీద వచ్చి మెడలో చైన్ కొట్టేసిన దొంగలపై మహిళ విరుచుకుపడింది. బైక్ మీద వెళ్తున్న దొంగను కాలర్ పట్టుకుని లాగి కింద పడేసింది. కసితీరేలా చితకబాదింది. మహిళ చేతుల్లో నుంచి తప్పించుకునేందుకు చైన్ స్నాచర్ ప్రయత్నించగా.. అటుగా వెళ్లే కొంతమంది వచ్చి అతన్ని పట్టుకున్నారు.
దొంగను స్థానికులు కింద పడేసి పిడిగుద్దులతో చితకబాదారు. బైక్ నడిపే మరో దొంగ అక్కడి నుంచి జారుకున్నాడు. అతన్ని కూడా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆగస్టు 30న ఢిల్లీలోని నంగోలయిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సోషల్ మీడియాలో సీసీ ఫుటేజీ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో… రిక్షాలో ఓ మహిళ ప్రయాణిస్తోంది. ఆమె వెంట బాలిక కూడా ఉంది. ఇద్దరు రిక్షా నుంచి దిగారు. రోడ్డు దాటుతుండగా.. అదే సమయంలో ఇద్దరు గొలుసు దొంగలు.. బైక్ పై రయ్యమంటూ దూసుకొచ్చారు. బైక్ పై వెనుక కూర్చొన్న దొంగ మహిళ మెడలో చైన్ లాగేశాడు.
అప్రమత్తమైన మహిళ.. దొంగను గట్టిగా పట్టేసుకుంది. అతడి కాలర్ లాగి కింద పడేసింది. దొంగ ముఖానికి హెల్మట్ ధరించి ఉన్నాడు. స్థానికులకు కూడా మహిళకు సాయంగా వచ్చి దొంగను పట్టుకుని చితకబాదారు. చైన్ కొట్టేసిన దొంగను ధైర్యంగా పట్టుకున్న మహిళకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియో ఇదే..