హిట్లర్,ముస్సోలిని,మోడీలు అవసరం లేదు

ప్రధానమంత్రి నరేంద్రమోడీని జర్మన్ నియంత నేతలు హిట్లర్,ముస్సోలినితో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌ వంటి నేతలు మనకు అవసరమని, హిట్లర్,ముస్సోలిని, మోడీ వంటి నేతలు అవసరం లేదన్నారు. న్యూజిలాండ్‌ లో రెండు మసీదుల్లో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బాధితులకు సంతాపం తెలుపుతూ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌ను  శనివారం(మార్చి-16,2019) దిగ్విజయ్ రీట్వీట్ చేస్తూ…నేను రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. సనాతన ధర్మంతో పాటు గౌతమ బుద్ధుడు, మహావీర్‌ వంటి వారు ప్రచారం చేసిన శాంతి, జాలి, దయా వంటి సిద్ధాంతాలు ప్రపంచానికి కావాలి. అంతేగానీ, విద్వేషం, హింస రేపే భావజాలం కాదు. మనకు మహాత్మా గాంధీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ వంటి వారు కావాలి. అంతేగానీ, హిట్లర్‌, ముస్సోలినీ, మోదీ వంటి వారు కాదని ఆయన ట్వీట్‌ చేశారు.

శుక్రవారం రాహుల్ చేసిన ట్వీట్ లో…న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాదానికి చెందిన నీచపు చర్య. ఇలాంటి చర్యను పూర్తిగా ఖండించాలి. ఇటువంటి వాటిని అర్థం చేసుకుంటూ వీటికి వ్యతిరేకంగా ప్రపంచం నిలబడుతోంది. ప్రత్యేక భావజాలంతో, విద్వేషంతో కూడిన ఈ తీవ్రవాదం ఉండడానికి వీల్లేదు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.