దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటివరకు దాదాపు 1200మందికి కరోనా సోకినట్లు తేలింది. దాదాపు 30మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్(COVID-19) వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా పలుచోట్ల పనులు లేక,చేతిలో డబ్బుల్లేకపోవడంతో ఆహారం దొరక్క కూలీలు లేదా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కూలీలకు MNREGA(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) స్కీమ్ కింద రూ.1000 అందజేస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీ ప్రకారం… సోమవారం(మార్చి-30,2020) యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రూ.611కోట్ల రూపాయలను పేద కూలీల ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. సుమారు 27.5 లక్షలమంది ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేసినట్లు సమాచారం.
కొందరు కూలీలతో కూాడా ఈ సందర్భంగా సీఎం యోగి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా మాట్లాడారు. ఈ స్కీమ్ గురించి వారికి సమాచారమందించారు. అందరికీ అండగా ఉంటామని యోగి హామీ ఇచ్చారు. లాక్ డౌన్ ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల ప్రజలు తమ ఇళ్లకు తిరిగి రావడంతో ఉత్తర ప్రదేశ్ రివర్స్ వలసలో భారీ పెరుగుదలను ఎదుర్కొంటోంది.
కాగా,ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ లో 75కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం మీరట్ లో 6కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. యూపీలోని గౌతమ్ బుధ్ద్ నగర్ లో కూడా ఇవాళ నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.
Also Read | నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్.. ఏటీఎంకి వెళ్లి శానిటైజర్ చోరీ