Destination Wedding In Space
Destination Wedding In Space : ఈరోజుల్లో పెళ్లి చేసుకోవటమంటే ఏదో ఏడు అడుగులు, మూడు ముళ్లు వేసేయటం కాదు..గ్రాండ్ గా ఉండాలి. ధరించే దుస్తులు, నగలు, పెళ్లి విందు, పెళ్లి మండపం,పెళ్లి వేదిక అంతా గ్రాండ్ గా ఉండాలి..ట్రెండ్లీగా ఉండాలి. పెళ్లి అంటే ఇలా ఉండాలనేలా ఉండాలి. దీని కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. శ్రీమంతులే కాదు మధ్యతరగతివారు కూడా తమ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు పెళ్లిళ్లకు.
వినూత్నంగా వివాహం చేసుకోవాలనుకునేవారి ఎంతోమంది ఉంటారు. కొంతమంది నీటి అడుగున ఉంగరాలు మార్చుకోవటం, విమానంలో పెళ్లి చేసుకోవటం, గాల్లో ఎగురుతు పెళ్లి చేసుకునే ఏర్పాట్లు కూడా లేకపోలేదు. వెడ్డింగ్ ఈవెంట్ సంస్థలు కోకొల్లులుగా డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నారు. కొత్త కొత్త ఐడియాతో వెడ్డింగ్ ప్లానర్లు ఈవెంట్ కోసం పోటీ పడుతున్నారు. డిపరెంట్ కాన్సెప్టులతో ఈవెంట్స్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) బాగా పాపులర్ అయింది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడమే డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్.
కానీ ఒక కోటి రూపాయలు ఖర్చు చేస్తే అంతరిక్షంలో పెళ్లి చేస్తామంటోంది ఓ సంస్థ. అంతరిక్షంలో (Space) పెళ్లి చేసుకోవాలనుకునేవారికి మాకంటే బెస్ట్ ప్లానర్స్ లేరంటోందీ సంస్థ. భూమికి లక్ష అడుగుల ఎత్తులో అంటే అంతరిక్షంలో పెళ్లి వేదికలను ఏర్పాటు చేసింది ‘స్పేస్ పెర్స్‌పెక్టివ్’ (Space Perspective) అనే సంస్థ. దీని కోసం ‘స్పేస్ పెర్స్‌పెక్టివ్’ ఓ స్పేస్ షిప్ ను ఏర్పాటు చేసింది. ఈ వెడ్డింగ్ స్పేస్ షిప్ పేరు నెఫ్ట్యూన్ (Neptune).
కార్బన్-న్యూట్రల్ బెలూన్ ద్వారా వీరు వధూవరులను అంతరిక్షంలోకి పంపిస్తారు. ఆ బెలూన్‌లను పెద్ద పెద్ద కిటికీలతో భూమి మొత్తం కనిపించేలా చక్కగా చాలా అందంగా డిజైన్ చేశారు. దీనిలో పైలెట్‌తో పాటు ఒకేసారి ఎనిమిదిమంది ప్రయాణించేలా ఏర్పాటు చేశారు.భూమి నుంచి లక్ష అడుగుల ఎత్తుకు వెళ్లి, వివాహం పూర్తయ్యాక తిరిగి కిందకు రావడానికి నెఫ్ట్యూన్‌కు ఆరు గంటల సమయం పడుతుంది.
2024నుంచి ఈ స్పేస్ వెడ్డింగ్‌లను (Space Wedding) లాంఛ్ చేయాలని ‘స్పేస్ పెర్స్‌పెక్టివ్’ సంస్థ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే బుక్కింగ్ లు కూడా జరిగిపోతున్నాయి. వినూత్నంగా పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఊరుకుంటారా మరి.. దీని కోసం అంతరిక్షంలో వివాహాలు చేసుకునేందుకు 1000మంది టికెట్లు బుక్ చేసేసుకున్నారట. మరి అంతరిక్షంలో పెళ్లి చేసుకోవాలంటే ఒక్క వ్యక్తి రూ.కోటి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎంతమంది వెళితే అన్ని కోట్లన్నమాట.. మరి..మీరు రెడీయా..??