Strange Thieves in Delhi
Strange Thieves in Delhi : దొంగలందు మంచి దొంగలు వేరయా..వారు ఎవరయా అంటే ఇదిగో వీరే అని చూపించొచ్చు. దేశ రాజధానిలో నెల రోజుల క్రితం జరిగిన ఓ దొంగతనం గురించి తెలిస్తే మీలాంటి దొంగలు ఉండాలయ్యా అనేలా జరిగింది. స్కూటీమీద వెళ్తున్న ఓ జంటను దోచుకుందామని కొంతమంది దొంగలు ప్లాన్ వేశారు. అనుకున్నదే తడవుగా తుపాకీ చూపించి బెదిరించారు. కానీ వాళ్ల వద్ద రూ.20లే ఉన్నాయని తెలిసిన ఆ దొంగలు పాపం అనుకున్నారో ఏమోగానీ ఆ జంటకు ఎదురు రూ.100 ఇచ్చివెళ్లిపోయారు. ఢిల్లీలోని షహదారాలోని ఫర్ష్ బజార్ లో జరిగిన ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో ఈ మంచి దొంగల విషయం బయటకొచ్చింది. ఈ మంచి దొంగల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సరిగ్గా అలాంటి ఘటనే ఢిల్లీలోని మరో ప్రాంతంలో జరిగింది.
Gandhari Vaana : గాంధారి వాన అంటే ఏంటి.. మహాభారతంలో గాంధారికి, గాంధారి వానకు సంబంధమేంటి..?
జులై 20-21 మధ్య రాత్రి రోహిణిలోని సెక్టార్ (Rohini Sector) 8లోని ఓ ఇంట్లో కొంతమంది వ్యక్తులు చోరీ కోసం వచ్చారు. కానీ ఆ ఇంట్లో వారికి అనుకున్నంతగా గిట్టుబాటుకాలేదు. ఆ ఇంట్లో డబ్బులు కానీ.. విలువైన వస్తువులు ఏమీ దొరకలేదు. దీంతో టైమ్ వేస్టు అనుకున్నారు. అక్కడితో ఊరుకోకుండా ఆ దొంగలు రూ.500 నోటును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. 21 తెల్లవారుజామున తన ఇంట్లో చోరీ జరిగినట్లుగా ఆ ఇంటి యజమానికి ఇరుగుపొరుగువారినుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆ ఇంటి యజమాని ఆఘమేఘాలమీద ఇంటికొచ్చి చూసుకునేసరికి ఏవీ చోరీకాలేదని తెలిసింది. పైగా అక్కడ ఓ రూ.500ల నోటు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు.
సదరు ఇంటి యజమాని రామకృష్ణ (M Ramakrishna). వయస్సు 80 ఏళ్లు. ఆయన రిటైర్డ్ ఇంజినీర్ (retired engineer). జులై 19న సాయంత్రం తన భార్యతో కలిసి గురుగ్రామ్‌లో ఉండే కొడుకు ఇంటికెళ్లారు. ఈక్రమంలో రోహిణిలోని తన ఇంట్లో జులై 21 తెల్లవారుజామున దొంగతనం జరిగినట్లు ఇరుగుపొరుగు వారి నుంచి ఫోన్ రావటంతో ఆందోళగా ఇంటికొచ్చి చూడగా మెయిన్ గేటు తాళం పగులగొట్టి ఉంది. కంగారుగా లోపలికి వెళ్లి చూడగా దొంగలు ఏమీ దొంగిలించలేదని తెలిసింది. కానీ ఓ రూ.500ల నోటు పడిఉండటం చూసి ఆశ్చర్యపోయాడా పెద్దాయన. పోలీసులకు ఈ విషయం చెప్పగా గతంలో జరిగిన ఓ చోరీని గుర్తు తెచ్చేలా ఉందని వారు కూడా ఆశ్చర్యపోయారు. అలా వారి ఇంట్లో ఏమీ దొరకక రూ.500నోటు వదిలి వెళ్లి ఉంటారని చెబుతున్నారు.