×
Ad

మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు.. ఫొటోలు వైరల్.. ఫొటోల్లో ఎవరెవరు ఉన్నారంటే?

దేశంలో తొలిసారిగా జరగనున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) వేడుకకు సన్నాహాలు జోరుగా సాగాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ నటుడు రామ్ చరణ్, తన సతీమణి ఉపాసనతో పాటు అనిల్ కామినేనితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ అరుదైన భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ను పురస్కరించుకుని ప్రధాని మోదీని కలవడం తనకు ఎంతో గౌరవంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ లీగ్‌కు అనిల్ కామినేని నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. రామ్ చరణ్ తన పోస్ట్‌లో.. క్రీడల పట్ల ప్రధానమంత్రికున్న ఆసక్తి, ఆయన మార్గదర్శకత్వం ఆర్చరీ క్రీడను ప్రపంచ వ్యాప్తంగా కాపాడటానికి, మరింతగా అభివృద్ధి చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ లీగ్‌లో పాల్గొంటున్న అథ్లెట్లందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపిన రామ్‌ చరణ్.. మరెంతో మంది ఈ అద్భుతమైన క్రీడలో పాల్గొని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఫొటోల్లో రామ్ చరణ్ తో పాటు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ట్రెజరర్ డా. జోరిస్, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAI) అధ్యక్షుడు అర్జున్ ముండా, ఆర్చరీ ప్రీమియర్ లీగ్ చైర్మన్ అనిల్ కామినేని, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ విరేందర్ సచ్దేవా ఉన్నారు. దేశీయ, అంతర్జాతీయ అగ్రశ్రేణి ఆర్చర్లు కూడా ఈ ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు.

1/5
2/5
3/5
4/5
5/5