ఏపీలో 25 జిల్లాలు..జగన్‌తో మాట్లాడా – కేసీఆర్

  • Publish Date - March 8, 2020 / 01:35 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడనే అంశంపై వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. 2020, మార్చి 07వ తేదీ శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా మేలు జరిగిందని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని… త్వరలోనే అక్కడి ప్రభుత్వం కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతోందని కేసీఆర్ అన్నారు.

ఈ అంశంపై ఏపీ సీఎం జగన్‌తో తాను మాట్లాడానని… తనకున్న సమాచారం మేరకు ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతోందని… ఏపీలో జిల్లాల సంఖ్య 25కు చేరే అవకాశం ఉందని కేసీఆర్ వివరించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఏపీలో ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానంటూ వైఎస్ జగన్ ఎప్పుడో ఎన్నికలకు ముందే ప్రకటించారు.

తాను అనుకున్నట్లుగానే మొన్నటి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి సీఎం సీట్లో కూర్చున్న తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ మోస్తరు కసరత్తు కూడా చేశారు. అంతేకాకుండా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సరైన సమయం కోసం జగన్ ఎదురు చూస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర విషయాలపై దృష్టి సారించిన సీఎం జగన్.. ప్రస్తుతానికి కొత్త జిల్లాల ఏర్పాటును పక్కనపెట్టేశారు. తాను అనుకున్న సరైన సమయం రాగానే… దీనిపై ఆయన చర్యలు ప్రారంభించే అవకాశాలున్నాయి. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా కేసీఆర్ అనూహ్యంగా ఏపీ కొత్త జిల్లాలపై మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

Read More : తెలంగాణ బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ