ఏపీకి 3 రాజధానులు : వైసీపీలో అసంతృప్తి సెగలు

  • Publish Date - December 20, 2019 / 10:17 AM IST

ఏపీలో బహుశా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామేమో అంటూ అసెంబ్లీలో  సీఎం వైఎస్ జగన్‌ చేసిన ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సభలో టేబుళ్లు చరుస్తూ హర్షం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పుడు మూడు రాజధానులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. అసెంబ్లీతో పాటు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలని మొదటిసారి నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తన గళం వినిపించారు. అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకేచోట నుంచి చేస్తే బాగుంటుందన్నది ఆయన ఉద్దేశం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన అంటున్నారు. 

విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలనేది గోపిరెడ్డి ఉద్దేశం. ఇప్పుడు గోపిరెడ్డి వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు.. అమరావతిలో దీక్షలు చేస్తున్న రైతులు ఆయన ఫొటోలను ప్రదర్శిస్తూ.. ఎమ్మెల్యేకు మద్దతు పలకడంతో వైసీపీలో కలకలం రేగింది. జగన్‌ ప్రకటన తర్వాత టీడీపీలోనే భిన్నస్వరాలు వ్యక్తమవ్వగా.. ఇప్పుడు వైసీపీలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే విషయం బయటపడింది. జగన్‌ ప్రకటనపై ఇంచుమించుగా గోపిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్టేనని జనాలు అంటున్నారు. అభివృద్ధి ఒకే ప్రాంతంలో ఉంటే ప్రాంతీయ అస‌మ‌తుల్యత చోటు చేసుకుంటుంద‌ని ముఖ్యమంత్రి జ‌గ‌న్ పేర్కొంటే… దానికి భిన్నంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కామెంట్లు చేయ‌డం స‌హ‌జంగానే ప్రతిప‌క్షాల‌కు అస్త్రం ఇచ్చిన‌ట్లయింద‌ని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మరోపక్క, చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు భాస్కరనాయుడు కూడా మూడు రాజధానులతో ప్రజలకు ఇబ్బందులే అంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచి వైజాగ్‌ వెళ్లాలంటే దాదాపు వెయ్యి కిలోమీటర్లు, కర్నూలుకు వెళ్లాలంటే 400 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ కంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం ముఖ్యమనే వాదనలు మొదలవుతున్నాయి. పార్టీ నిర్ణయం కావడంతో కొందరు మాట్లాడడం లేదు గానీ.. వైసీపీలో కూడా ఈ విధానంపై లోలోపల వ్యతిరేకత ఉందని జనాలు గుసగుసలాడుతున్నారు. అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గాలతో పాటు.. కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేల్లోనూ దీనిపై అంతర్గతంగా అసంతృప్తి ఉందంటున్నారు. 

ఇప్పటికే అమరావతి ప్రాంతంలో జనాలు రోడ్డెక్కుతున్నారు. రైతులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో స్థానిక ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని లోలోపల అనుకుంటున్నారట. ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ విషయంలో స్థానికుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. మంత్రి కొడాలి నాని కూడా జగన్‌ నిర్ణయానికి మద్దతు పలుకుతూనే.. వ్యక్తిగత అభిప్రాయాల కంటే ప్రభుత్వ నిర్ణయమే ముఖ్యమని చెప్పడం వెనుక.. ఆయనలోనూ అంతర్గతంగా ఈ నిర్ణయం పట్ల కొంత అసంతృప్తి ఉందనే అంటున్నారు జనాలు. 

ఇప్పటి వరకూ జగన్‌ చెప్పిన, చేసిన నిర్ణయాలకు పార్టీ తరఫున ఎప్పుడూ ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ, నరసారావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి లాంటి వారు భిన్నంగా మాట్లాడడం జగన్‌కు షాకేనని అంటున్నారు. రాజధాని అంశానికి వచ్చే సరికి మాత్రం సీన్ ఇలా మారడంతో ఇప్పుడు కమిటీ నివేదిక వచ్చాకే నిర్ణయమనే మాటలు చెబుతున్నారు కొందరు మంత్రులు. పార్టీ నేతలు, మంత్రులు జగన్‌ మాటకు ఎదురుచెప్పే ధైర్యం చేయలేక తమ మనసులో మాటను మీడియా ముందు ఇన్‌డైరెక్ట్‌గా చెబుతున్నారని అంటున్నారు.

మొత్తం మీద పరిపాలన అంతా ఒక చోట నుంచే జరిగితే బాగుంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోందని అధికార పార్టీలోని కొందరు నేతలు అనుకుంటున్నారట. జగన్‌ ప్రకటన విషయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. జనాల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో తెలుసుకోవడానికే ఇలా చేశారంటున్నారు. ఏదైనా మొత్తం మీద నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయని చెబుతున్నారు.

కాగా….రాజధానితో  అమరావతితో పాటు పలు అంశాలపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ తన నివేదిక సిద్ధం చేసింది. జీఎన్ రావు కమిటీ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు నివేదికతో సహా చేరుకుంది. రాజధానిపై సీఎం జగన్ కు జీఎన్ రావు కమిటీ తమ నివేదిక ఇవ్వనుంది. రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. కేపిటిల్ గురించి కమిటీ సభ్యులు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. వాటి ఆధారంగా ఓ నివేదికను రూపొందించారు. ఆ రిపోర్ట్ సీఎం జగన్ దగ్గరికి వచ్చింది. కాగా, తమ నివేదికలో జీఎన్ రావు కమిటీ.. ఏం చెప్పింది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.