3 రాజధానులపై హై కోర్టులో నేడు విచారణ

  • Publish Date - January 22, 2020 / 05:33 AM IST

ఆంధ్రప్రదేశ్ ను 3 రాజధానులుగా ఏర్పాటు చేసే అంశంపై  బుధవారం హై కోర్టులో విచారణ జరగనుంది.  ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ  రాజధాని రైతులు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని 37 మంది రైతులు కోరారు. సీఆర్డీఏ రద్దుపై  హైకోర్టులో మరో పిల్ దాఖలైంది.  కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులను ప్రతివాదులుగా చేరుస్తూ పిల్ దాఖలు చేశారు.

ఏపీని 3 రాజధానులుగా చేయవచ్చని సీఎం జగన్ నెల రోజుల క్రితం అసెంబ్లీలో ప్రకటించినప్పటినుంచి రాజధాని గ్రామాల్లో రైతులు నిరసనలు తెలియచేస్తూనే ఉన్నారు. ఈ అంశంపై  ప్రత్యేకంగా సమావేశం ఐన అసెంబ్లీ… ఏపీ ని 3 రాజధానులుగా చేస్తూ రూపోందించిన బిల్లుకు శాసనసభ  జనవరి 20న అమోదం తెలిపింది. రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తూ సీఎం జగన్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో మూడు రాజధానుల ప్రతిపాదనకు శాసనసభ పచ్చజెండా ఊపింది. ఈ బిల్లు ప్రకారం పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనుంది. దీంతోపాటు సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు కూడా ఆమోదం పొందింది.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఎలాంటి ఓటింగ్ లేకుండానే సభలో బిల్లు పాస్ అయింది. ఈ కొత్త బిల్లు ప్రకారం అమరావతి శాసన రాజధాని, విశాఖపట్నం పరిపాలనా రాజధాని, కర్నూలు జ్యుడీషియల్ కేపిటల్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం తీర్మానం చేసింది. అనంతరం ఆర్థికమంత్రి బుగ్గన బిల్లును పాస్‌ చేయాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో బిల్లు పాసయినట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఈ బిల్లు ఇప్పుడు ఆమోదం కోసం శాసన మండలిలో ఉంది.