ఏపీ లో3 రాజధానులు అంశం ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. రాజధాని అమరావతి గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గత 9 రోజులుగా రైతులు నిరసనప్రదర్శనలునిర్వహిస్తూనే ఉన్నారు. రాజధాని రైతులు గురువారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను గురువారం కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ వారు గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు.
తొమ్మిది రోజులుగా రాజధానిలో జరుగుతున్న పరిణామాలను ఈ సందర్భంగా రైతులు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆనాడు ప్రభుత్వం అడిగితే అందరమూ భూములు ఇచ్చామని గవర్నర్ కు వివరించారు. రాజధాని అమరావతిలోనే ఉండేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలనివారు గవర్నర్ ను కోరారు. అయితే గవర్నర్ ఈ విషయాలపై సానుకూలంగానే స్పందించినట్లు రైతులు తెలిపారు.
175 మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఆనాడు అమరావతిని రాజధానిగా అంగీకరించారని, జగన్ కూడా ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పినట్లు వారు గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు ఏకపక్షంగా రాజధానిని తరలిస్తామని ప్రకటించడం అన్యాయమని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని, లేకుండా తమ జీవితాలు రోడ్ల పాలవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధను అర్థం చేసుకొని అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని వారు గవర్నర్ ను కోరారు.