సర్వత్రా ఉత్కంఠ : ఏపీ సీఎస్ ఢిల్లీ టూర్ 

  • Publish Date - April 26, 2019 / 01:03 AM IST

ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ విచారణ కోసమే వెళ్తున్నారా…? రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీ పెద్దలనేమైనా కలుస్తారా..?  సీఎస్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆయన పర్యటనపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హస్తిన పర్యటనపై అధికార వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తి నెలకొంది.

కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌‌లో విచారణ జరుగనుంది. దేశ వ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్రాలు విఫలమవడంపై ఎన్జీటిలో విచారణ జరుగుతోంది. ప్రధానంగా పురపాలక సంఘాలు, అటవీ శాఖలు విఫలమవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

మరోవైపు కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి 100కోట్ల రుపాయలు నెల రోజుల్లోపు డిపాజిట్ చేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఏప్రిల్ 4న ఉత్తర్వులు ఇచ్చింది. గడువు దాటితే 12.5శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్‌ బృందం వాదనలు వినిపించనుంది. 

ఇదిలా ఉంటే హస్తిన పర్యటనలో సీఎస్ ఎవరెవరిని కలుస్తారనే  దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్జీటి విచారణకు పరిమితమవుతారా కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఇతర ఢిల్లీ పెద్దలను కలుస్తారా అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. సీఎస్‌ టార్గెట్‌గా టీడీపీ వర్గాలు విమర్శలు గుప్పిస్తుండటంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు వివరిస్తారనే టాక్‌ నడుస్తోంది.