మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి సీఎం జగన్ బ్యాడ్ న్యూస్

  • Publish Date - July 18, 2020 / 03:39 PM IST

ఆశావహులు ఎందరో. అదిగో ఇదిగో అని ఊరిస్తున్న ముహూర్తం. ఏపీ కేబినెట్ విస్తరణలో అవకాశం కోసం ఎమ్మెల్యేలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఊహల్లో విహరించేస్తున్నారు. అనుచరుల దగ్గర మనకే చాన్స్ అంటూ చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ముహూర్తం మారే చాన్స్ ఉందనే టాక్ మొదలైంది. మరి కొద్ది రోజులు ఆశావహులందరినీ ఊహల్లో ఊరేగించే చాన్స్ ఇచ్చేసి విస్తరణ వాయిదా వేస్తారట. మళ్లీ ఎప్పుడు ముహూర్తం పెడతారో, మనకు అవకాశం వస్తుందో, రాదోనని వారంతా ఎదురుచూస్తున్నారు.

ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ అని వార్తలు:
ఏపీ కేబినెట్‌లో రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు చర్యలు కూడా మొదలయ్యాయి. ఈ నెలలోనే కేబినెట్‌ విస్తరణకు సీఎం జగన్‌ సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో మరికొన్ని రోజులు వాయిదా పడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రావణ మాసం ప్రారంభం రోజున అంటే జూలై 22న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలన్న ముహూర్తం ఖరారైందనే టాక్‌ వినిపించింది. కానీ, ప్రభుత్వ పరంగా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

2 మంత్రి పదవులతో పాటు డిప్యూటీ సీఎం పోస్టు కోసం తీవ్ర పోటీ:
మరోవైపు ఖాళీ అవుతున్న రెండు మంత్రి పదవులతో పాటు డిప్యూటీ సీఎం పోస్టు కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆశావహుల జాబితా పెద్ద చాంతాడులా ఉందంటున్నారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ప్రస్తుతం రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో వారి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీరిద్దరూ ఏపీ శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానాల్లో చాన్స్‌ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. వారిలో సీనియర్‌ నాయకులు ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి వారున్నారు. ఇక పొన్నాడ సతీశ్‌, జోగి రమేశ్‌, విడదల రజిని, ముత్యాలనాయుడు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు.

మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో మరో ఇద్దరు:
మరో రెండు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిదిరి అప్పలరాజుకు ఒక పోస్టు కేటాయిస్తారంటున్నారు. ఆయన మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఇస్తారంటున్నారు. పిల్లి సుభాశ్‌ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. దీంతో డిప్యూటీ సీఎం పోస్టు కోసం శంకర్‌నారాయణ, ధర్మాన కృష్ణదాస్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా కేబినెట్‌ బెర్త్‌ ఆశిస్తున్నారట.

ఉన్న రెండు పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో పోటీ కనిపిస్తోంది. మరోపక్క రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఇబ్బందిగా ఉన్నందున ఇప్పుడిప్పుడే విస్తరణ చేపట్టకపోవచ్చంటున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొంత కాలం పాటు వాయిదా వేయవచ్చనే టాక్‌ కూడా వినిపిస్తోంది. చూడాలి మరి జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.