ఐపీఎస్‌ల బదిలీల వివాదం : విజయసాయి రెడ్డిపై పరువు నష్టం దావా

  • Publish Date - March 28, 2019 / 04:29 AM IST

తనను ఈసీ బదిలీ చేయడంపై కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని… లేదంటే తనపై ఫిర్యాదు  చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నం… తనపై ఆరోపణలు చేసిన వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా వేశారు.

అధికారు దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఈసీ ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ లపై చర్యలు తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నంలపై వేటు వేసింది. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఐపీఎస్ అధికారుల బదిలీలపై రాజకీయ దుమారం రేగుతోంది. అధికారుల బదిలీపై తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరుగుతోంది. ఐపీఎస్ అధికారుల బదిలీ సరికాదని ఇదంతా ఒక కుట్ర పూరితంగా జరుగుతోందని ఆరోపిస్తోంది.

కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సహజ న్యాయానికి విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైసీపీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చెయ్యకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని లేఖలో ప్రశ్నించారు. బదిలీల విషయం ప్రభుత్వానికి తెలపకపోవడం బాధాకరమని లేఖలో తెలిపారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేలా ఈసీ వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.