నేను నోరు తెరిస్తే గంటా బండారం బయటపడుతుంది.. అవంతి శ్రీనివాస్ 

  • Publish Date - September 2, 2019 / 07:34 AM IST

టీడీపీ నేత గంటా శ్రీనివాస్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు మంత్రిగా ఉండి చేసిన భూ కబ్జాలు, అరాచకాలపై గంటా  సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు.  అన్నం పెట్టిన వారికి గంటా సున్నం పెడతాడని…రాజకీయాల్లోకి తీసుకువచ్చిన అయ్యన్నపాత్రుడుకు గంటా అదే చేశాడని విమర్శించారు. తనను మంత్రికాదన్న గంటాను కనీసం మనిషిగా కూడా గుర్తించబోనని అవంతి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు లాగా గంటా కూడా ఇప్పటికీ మంత్రిననే భ్రమలో ఉన్నాడని ఎద్దేవా చేశారు మంత్రి.  తాను నోరు తెరిస్తే గంటా బండారమంతా బయటపడుతుందని అవంతి హెచ్చరించారు. విజయనగరం జిల్లా ఇంఛార్జ్‌ మంత్రిగా ఉండి ఏమీ సాధించలేకపోయాడని ఎద్దేవా చేశారు. నమ్ముకున్న వారికి సీట్లు ఇప్పిస్తానని గంటా పంగనామాలు పెట్టాడని అవంతి శ్రీనివాస్ విమర్శించారు.

పార్టీకి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చే ఎవర్నైనా  సీఎం జగన్ పార్టీలో చేర్చుకుంటారని….కన్నింగ్‌లను, కబ్జాదారులను వైసీపీ చేర్చుకోరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.  గంటా శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో.. మంత్రి కామెంట్లు కలకలం రేపుతున్నాయి.