ఏపీ రాజధాని మరో రాష్ట్రానికి తరలి పోవడం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మూడు రాజధానులుగా చేయనున్న విశాఖ, కర్నూలు కూడా ఏపీలోనే ఉన్నాయన్నారు.
ఏపీ రాజధాని మరో రాష్ట్రానికి తరలి పోవడం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మూడు రాజధానులుగా చేయనున్న విశాఖ, కర్నూలు కూడా ఏపీలోనే ఉన్నాయన్నారు. అవి వేరే భూభాగంలో లేవన్నారు. గుంటూరు జిల్లా తెనాలి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్క కులానికో, ప్రాంతానికో వ్యతిరేకం కాదని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్రకు, కరువు ప్రాంతమైన రాయలసీమకు న్యాయం జరగాలన్నదే సీఎం ధ్యేయమని స్పష్టం చేశారు.
మరోవైపు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని బీజేపీ చేసిన తీర్మానంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం లక్షా 9వేల కోట్లు ఇస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెస్తే ఆయన పేరుతోనే రాజధానిని నిర్మిస్తామన్నారు. రాజధానిపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఆ పార్టీకి విలువలు లేకుండా పోవడానికి భిన్నాభిప్రాయాలే కారణమని అన్నారు. రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మినారాయణ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
రాజధాని రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారని మంత్రి చెప్పారు. నిజమైన రైతులు దాడులు చేయరని…. గతంలో భూములు ఇవ్వమంటూ రైతులు పోరాటం చేసిన విషయం మర్చిపోకూడదని మంత్రి అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీలకు అలవాటుపడే పవన్ అలా మాట్లాడుతున్నారని వెల్లంపల్లి తీవ్రస్థాయిలో విమర్శించారు.
అమరావతి రైతులు చేపట్టిన ఆందోళనలు 27వ రోజుకు చేరుకున్నాయి.
గత 26 రోజులుగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు ఆందోళలు చేస్తున్నారు. రోజుకో రూపంలో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. 29 గ్రామాల ప్రజలు అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఆందోళనలను కొనసాగిస్తున్నారు. వీరి ఆందోళనలకు వైసీపీ తప్ప మిగతా రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు సైతం రైతులు ఆందోళనకు అండగా నిలిచాయి.
రాజధానిని మార్చవద్దని.. మూడు రాజధానుల ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిరసనలు ఎగసి పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా ఇవాళ రస్తారోకో, మహాధర్నాలు చేయనున్నారు.