YS Sharmila : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేేసే స్థానాలపై షర్మిల కీలక ప్రకటన

సీపీఎం, సీపీఐ పార్టీలతో చర్చలు జరుపుతున్నాం. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాటం చేస్తోంది.

YS Sharmila : ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. కాంగ్రెస్ ఏపీలో ఉందనడానికి 1500 అప్లికేషన్లు రావడం నిదర్శనం అన్నారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని షర్మిల తెలిపారు. బీజేపీ, ఇతర పార్టీలో అభ్యర్థుల ఎంపిక ఈ విధంగా జరగదన్నారు. బీజేపీ ఇతర రీజనల్ పార్టీలు నియంతలా తయారవుతున్నాయని షర్మిల చెప్పారు.

”అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పోటీకి అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థుల మీద చర్చ జరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ, లోక్ సభ సీట్లలో గట్టి పోటీ ఇవ్వగలము. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం సైనికులుగా పని చేయాలి. పార్టీ ఆదేశిస్తే ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయాల్సిందే. సీపీఎం, సీపీఐ పార్టీలతో చర్చలు జరుపుతున్నాం. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాటం చేస్తోంది. గతంలో ప్రత్యేక హోదా మీద మాట్లాడిన సీఎం జగన్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? ప్రత్యేక హోదాపై జగన్ సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని అంశాలపై కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడుతుంది” అని షర్మిల అన్నారు.

Also Read : టీడీపీకి షాక్..! వైసీపీలోకి యనమల కృష్ణుడు..!