BJP believes in fascism & wear mask of democracy says CM Gehlot
CM Gehlot: ప్రజాస్వామ్యం ముసుగు కప్పుకున్న ఫాసిస్టు పార్టీ భారతీయ జనతా పార్టీయని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి వారు ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తారని, అయితే వారు చూపించే కృత్రిమ ప్రకాశం బద్దలవుతుందని ఆయన అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య తేడాలను, విధానాలను ప్రజలు గమనిస్తున్నారు. రాజస్తాన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా వారికి అత్యుత్తమ ప్రభుత్వ విధానాన్ని అందిస్తున్నాం. గుజరాత్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘బీజేపీ చూపించే కృత్రిమ కాంతి నేడు బద్దలు అవుతోంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు వారికి సరైన అభ్యర్థులే లేరు. ప్రజలు వారి జిమ్మిక్కుల్ని పసిగడుతున్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది. కానీ బీజేపీ అలా కాదు. ఎన్నికల కోసం ప్రజాస్వామ్య ముసుగు కప్పుకున్నప్పటికీ, వారిది పూర్తిగా ఫిసిస్టు ధోరణి’’ అని అన్నారు.