బ్రేకింగ్ న్యూస్ : ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు

  • Publish Date - March 8, 2020 / 03:41 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 2020, మార్చి 08వ తేదీ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఉరి వేసుకుని చనిపోయాడు. కూతురిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ప్రణయ్‌ని హత్య చేయించినట్లు మారుతీరావుపై ఆరోపణలున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదు. 

తన కుమార్తె అమృత ప్రేమించి పెళ్లిచేసుకుందన్న అక్కసుతో 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద ప్రణయ్‌ను కిరాయి హంతకులతో మారుతీ రావు హత్య చేయించినట్టు కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేయడంతో 7నెలలపాటు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. అమృత గర్భవతిగా ఉన్న సమయంలో వైద్య పరీక్షల నిమిత్తం  ప్రణయ్‌, ఆయన తల్లి హాస్పిటల్‌కు తీసుకెళ్లి… అక్కడ నుంచి బయటకు వస్తుండగా ప్రణయ్‌ హత్య జరిగింది.

వెనుక నుంచి వచ్చిన నిందితుడు ప్రణయ్‌ను కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో మారుతీరావే సుపారీ ఇచ్చి ప్రణయ్‌ని హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. మారుతీరావుతోపాటు ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్‌, మరో వ్యక్తిపైనా పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు.

ఇటీవల మిర్యాలగూడలోని మారుతీరావు షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కూడా కలకలం రేపింది. ఆ మృతదేహం ఎవరిది? ఆ షెడ్డులోకి ఎలా వచ్చింది? అన్నది ఇంతవరకు తేలలేదు. ఈ తరుణంలోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది.
Read More : టీ20 మహిళా వరల్డ్ కప్ : హర్మన్ పుట్టిన రోజు..విజయీభవ..దిగ్విజయీభవ