ఆర్థిక మాంద్యంతో అల్లాడుతున్న తెలంగాణ ఖజానాకు.. ఈసారైనా కేంద్రం నుంచి భరోసా దక్కుతుందా? తెలంగాణ పథకాలను భేష్ అంటున్న కేంద్రం.. వాటికి ఆర్థిక సాయాన్ని అందించడంలో పెద్ద మనసు చూపుతుందా? కేంద్ర బడ్టెట్‌పై తెలంగాణ సర్కార్ పెట్టుకున్న అశలు నేరవేరతాయా?
ఖజానాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే.. ఆబ్కారీ, రవాణా, జీఎస్టీ, ఐజీఎస్టీ, వ్యాట్‌ల వృద్ధి రేటు బాగా తగ్గిపోయింది. జీఎస్టీ రాబడిలో.. 17 శాతం ఉన్న వృద్ధి రేటు.. 3 నుంచి 5 శాతానికి పడిపోయినట్లు సమాచారం. దీనికితోడు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా భారీగా తగ్గుతుండడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. దీంతో ఇప్పుడు తెలంగాణ సర్కార్ కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకుంది.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రికార్డ్ సమయంలో పూర్తిచేయడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, సీతారామా ప్రాజెక్టులను సైతం పూర్తిచేసింది. గతేడాది రాష్ట్రానికి వచ్చిన కేంద్రం వాటా 18 వేల 500 కోట్లైతే ఈ సారి ఈ అంకెలు తగ్గుతాయని సమాచారం.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు 52 వేల కోట్లు నిధులిచ్చేలా కేంద్రానికి సూచించాలని 15 ఆర్థిక సంఘానికి లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఐదేళ్ల నిర్వహణకు కనీసం 40 వేల కోట్లు ఖర్చవుతాయని అంచానా వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కనీసం ఈ నిధులనైనా కేంద్రం అందించాలని కోరుకుంటోంది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా ఇంటింటికీ మిషన్ భగీరథ పనులను సైతం పూర్తి చేసింది. 40 వేల కోట్లతో మిషన్ భగీరథను కంప్లీట్ చేసింది. ఎన్నిసార్లు విజ్ఞప్తుల చేసినా ఈ ప్రాజెక్టుకు సైతం.. ఒక్క పైసా ఆర్థిక సహాయం అందించలేదు కేంద్రం. మిషన్ భగీరథకు వచ్చే ఐదేళ్లలో నిర్వహణకు అయ్యే ఖర్చు 12 వేల 770 కోట్లు. ఈ నిధులను కేంద్రం అందించాలని కోరుకుంటోంది తెలంగాణ సర్కార్.
మరోవైపు రైతు బంధు, రైతు రుణమాఫీ, ఆసరా ఫించన్లు, మిషన్ కాకతీయ, పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ పథకాలను అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. వీటిలో డబుల్ బెడ్ రూమ్ పథకానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి సూమారు 7 వందల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని సమాచారం. ఇక రాష్ట్ర వాటాగా రావాల్సిన జీఎస్టీ నిధులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆర్థికంగా కేంద్రం భరోసా కావాలని ఆశపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. విభజన హామీలైన కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలు కూడా ఇప్పటికీ అమలుకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసలు కురిపిస్తున్న కేంద్రం .. వాటికి సహకరించడంలో మాత్రం వివక్ష చూపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా.. తమపై కరుణ చూపుతుందా.? ఆర్థిక భరోసా కల్పిస్తుందా..? అని తెలంగాణ సర్కార్ కంట్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది. మరి సీఎం కేసీఆర్ ఆశలపై మోదీ ప్రభుత్వం ఏమేరకు దయ చూపుతుందో చూడాలి.
Read More : ఆశలు ఫలించేనా : కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆశలు నెరవేరేనా