ఉద్యోగులకు జీతాల్లేవు : చంద్రబాబు త్వరలోనే శిక్ష అనుభవిస్తారు

  • Publish Date - April 28, 2019 / 07:27 AM IST

విజయవాడ : వైసీపీ నేత సి.రామచంద్రయ్య ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అక్రమాలకు త్వరలోనే శిక్ష అనుభవిస్తారని అన్నారు. మే 23న ఫలితాల్లో ఎవరు గెలిస్తే వాళ్లు సీఎం అవుతారని చెప్పారు. జూన్ 8వరకు నేనే సీఎం అని చంద్రబాబు అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సమీక్షలు చేస్తే తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చంద్రబాబు, టీడీపీ నేతల భయపడుతున్నారని రామచంద్రయ్య అన్నారు. అందుకే సీఎస్ సమీక్షలపై టీడీపీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకని రామచంద్రయ్య ప్రశ్నించారు.

సీఎస్ అవినీతి చేస్తే తప్పు కానీ.. అవినీతి వెలికితీస్తే తప్పు కాదన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు నాశనం చేశారని రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు ప్రజలకు కావాల్సిన సదుపాయాలపై రివ్యూ చెయ్యరని,
కమీషన్లు వచ్చే వాటిపై మాత్రమే రివ్యూలు చేస్తారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పవర్ బ్రోకర్లు, స్టాక్ బ్రోకర్లు సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు. ఆర్థికమంత్రి యనమలనా? కుటుంబరావా? అని ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ మరింతగా దిగజారిపోయిందన్నారు. రాష్ట్రం అప్పులు రూ.2 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఏపీ బడ్జెట్ క్రమపద్ధతిలో లేదన్నారు. నిబంధనలను తుంగలో తొక్కిన చంద్రబాబు ఇష్టానుసారం భారీ వడ్డీలకు అప్పులను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ పాలనలో ప్రభుత్వ నిధులకు, సొంత నిధులకు తేడా లేకుండా పోయిందని రామచంద్రయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి మరీ చంద్రబాబు అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అప్పులను ఎవరి కోసం, ఎందు కోసం చేశారో చంద్రబాబు చెప్పలేదన్నారు. ప్రజల కోసం కాకుండా సొంత ఆస్తులను పెంచుకునేందుకే చంద్రబాబు ఐదేళ్లు పనిచేశారని విమర్శించారు.