ఎన్నికల ముంగిట వైసీపీ గూటికి కీలక నేత

  • Publish Date - March 6, 2019 / 11:18 AM IST

ఎన్నికల ముంగింట్లో అధికార తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌ చెర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీ గూటికి చేరబోతున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి సొంత నియోజకవర్గం అయిన బనగానపల్లిలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చల్లాకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ తరపున బనగానపల్లి నుంచి బరిలోకి దిగాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. 2014లో కాటసాని రామిరెడ్డి వైసీపీ నుంచి పోటీచేసి ఇక్కడి నుంచి ఓడిపోయారు.
మార్చి 8వ తేదీన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో చల్లా రామకృష్ణా రెడ్డి వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కర్నూలు జిల్లాలో చల్లా రామకృష్ణారెడ్డి సీనియర్ నేత కాగా.. ఆయనకు రెండు మూడు నియోజకవర్గాల్లో మంచి కేడర్‌ ఉంది. కోవెలకుంట్ల, బనగానపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు.  దశాబ్దాలుగా కర్నూలు జిల్లాలో ఓటు బ్యాంక్‌ కలిగిన చల్లా నిర్ణయంతో కర్నూలు జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లుగా చెబుతున్నారు.