చంద్రబాబు ఇసుక దీక్షకు అనుమతి నిరాకరణ

  • Publish Date - November 8, 2019 / 09:02 AM IST

ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ, భవన నిర్మాణ కార్మికులకు అండగా  మాజీ సీఎం చంద్రబాబు జరుప తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నంవబర్ 14న చంద్రబాబు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్ష చేపట్టటానికి పార్టీ శ్రేణులు అనుమతి కోరుతూ పోలీసు కమీషనర్కు, మున్సిపల్ కమీషనర్కు లేఖలు రాశారు.

అయితే స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదంటూ అధికారులు తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే..ప్రభుత్వం అనుమతి నిరాకరించినా చంద్రబాబు దీక్ష జరిగి తీరుతుందని టీడీపీ నేతలు తేల్చిచెప్పారు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నేతలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ధర్నాచౌక్‌ను ఆ పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. మరో వైపు నవంబర్ 3న జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ కూడా లాంగ్ మార్చ్ పేరుతో విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రతిపక్ష నేత ఇసుక దీక్ష చేపట్టానికి అనువైన ప్రదేశం కోసం టీడీపీ నాయకులు తగిన ప్రాంతం కోసం పరిశీలిస్తున్నారు.