అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చ జరుగుతున్న సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సీఎం చంద్రబాబు మధ్య హాట్‌హాట్‌గా డిబేట్ జరిగింది. సీరియస్‌గా చర్చ జరుగుతుండగా.. విష్ణుకుమార్ లేచి రాష్ట్ర అభివృధ్దికి బీజేపీ కట్టుబడి ఉంటుందనటంలో ఏమాత్రం సందేహం లేదని, చట్టంలో లేనివి కూడా కేంద్రం ఇచ్చిందని కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన విద్యాసంస్ధల వివరాలు చెప్పడం మొదలు బెట్టారు. వెంటనే చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు.
కొత్త రాష్ట్రం వస్తే సపోర్టు చేయాల్సింది పోయి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, కొత్త రాష్ట్రాలను ఆదుకోవాల్సింది పోయి మోసం చేస్తున్నారని, తమిళనాడు,గుజరాత్ లతో పోల్చి చూసి రాష్ట్రానికి ఏమిచ్చారో చెప్పమని విష్ణుకుమార్ రాజును చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతూ ప్రశ్నించారు. ఇంత అన్యాయం జరిగినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. కేంద్రం చేసిన పనికి రక్తం మరిగిపోతోందని.. ఏమిచ్చారని మళ్లీ మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టబోమని.. ఎక్కడా తిరగనీయమని హెచ్చరించారు.