అమరావతి పర్యటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. అమరావతి పర్యటన వెనుక కారణాలు వెల్లడించారు. వైసీపీ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో
అమరావతి పర్యటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. అమరావతి పర్యటన వెనుక కారణాలు వెల్లడించారు. వైసీపీ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిపై అందరికీ వివరిస్తానన్నారు. రాజధాని అంశం 5 కోట్ల ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయం వైసీపీ నేతలకు తెలుసు అని చంద్రబాబు అన్నారు. పథకం ప్రకారమే రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఉండవల్లిలో తన నివాసం దగ్గర పూలే చిత్రపటానికి నివాళి అర్పించిన తర్వాత అమరావతి పర్యటనకు చంద్రబాబు బయలుదేరారు. అంతకుముందు తన నివాసం పక్కన కూల్చేసిన ప్రజావేదికను పరిశీలించారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా చంద్రబాబు రాజధానిలో పర్యటిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ది పనులను ప్రతిపక్ష నేత హోదాలో పరిశీలించేందుకు చంద్రబాబు అమరావతి పర్యటనకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంత రైతులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై వివరించనున్నారు.
కాగా, చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనలు, ఆందోళనలు, ఘర్షణలు, పోటాపోటీ నినాదాలతో అమరావతిలో హై టెన్షన్ నెలకొంది. రైతులు రెండు వర్గాలుగా విడిపోయారు. చంద్రబాబుకి అనుకూలంగా ఓ వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం నినాదాలు, నిరసనలు చేస్తున్నారు. అటు టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. చంద్రబాబు రాకతో భారీగా పోలీసులు మోహరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో కొందరు రైతులు చంద్రబాబు ప్రయాణం చేస్తున్న బస్సుపై చెప్పులు విసిరారు.