నర్సాపురం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబు సంచలన ప్రకటన చేశారు. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీకి అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని వెల్లడించారు. మెగా అభిమానులు అందరూ జనసేనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వివరించారు నాగబాబు. అదే విధంగా నర్సాపురం నియోజకవర్గంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రచారంలో పాల్గొనేది.. లేనిది పవన్ నిర్ణయిస్తారని తెలిపారాయన. ప్రచారంలో మెగా ఫ్యామిలీకి ఉన్న ఆదరణ కనిపిస్తుందన్నారు. మెగా ఫ్యాన్స్ జనసేన సైనికులుగా మారిపోయారని స్పష్టం చేశారు. నర్సాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు నాగబాబు.
Read Also : నన్ను కొట్టడానికి 100మంది వచ్చి.. చప్పట్లు కొట్టి వెళ్లారు
ప్రజాసేవ చేసేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నానని.. రాజకీయాల్లో మార్పు రావాలని ఆకాంక్షించారాయన. పవన్ పార్టీ నుంచి సీటు దక్కడం తన అదృష్ణంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు అన్నయ్య. ప్రజలకు సేవ చేసే అవకాశం పవన్ కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.
ప్రజలకు ఎలా సేవ చేయాలనే తన ఆలోచనకు.. ఇలా అవకాశం దొరికిందన్నారని అభిప్రాయపడ్డారాయన. పవన్ ఇమేజ్ తన విజయానికి దోహదపడుతుందని వివరించారు. పవన్ కళ్యాణ్ విజన్ ఉన్న నాయకుడు.. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని స్పష్టం చేశారు. నరసాపురం బ్రిడ్జీ నిర్మాణంతోసహా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
జబర్దస్త్ ను వదిలిపెట్టనని… కొనసాగిస్తానని చెప్పారు. నెలలో నాలుగు రోజులు కేటాయిస్తే కావాల్సినన్ని ఎపిసోడ్స్ వస్తాయన్నారు. జబర్దస్త్ కామిడీ షోలో పని చేయడం కూడా ఒక ప్రజా సేవలాగా భావిస్తున్నానని తెలిపారు. మిగిలిన వాటిపైన ఆసక్తి లేదన్నారు.
Read Also : పేమెంట్ పెంచగానే రెచ్చిపోతే ఎలా : పవన్ పై విజయసాయి సెటైర్లు