ఏపీలో 30లక్షల మంది పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. దేవుడు కరుణిస్తే, అడ్డంకులు అన్నీ తొలిగిపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీనే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ చెప్పారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో జగనన్న పచ్చ తోరణం.. 71వ వన మహోత్సవాన్ని సీఎం జగన్ బుధవారం(జూలై 22,2020) ప్రారంభించారు. గాజులపేటలో సీఎం జగన్ మొక్క నాటారు.
రాష్ట్రవ్యాప్తంగా 20కోట్ల మొక్కల నాటాలని లక్ష్యం:
ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ప్రణాళిక రచించింది. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో 30లక్షల మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రమంతా పచ్చతోరణం కావాలన్నారు. గ్రామాల్లో మొక్కల సంరక్షణ బాధ్యతను.. పంచాయతీలు, గ్రామ-వార్డు సచివాయాలు, వాలంటీర్లకు ప్రభుత్వం అప్పగించింది. చెట్లు నాటితే ప్రకృతి బాగుంటుందని, అందరూ చెట్లు నాటాలని సీఎం జగన్ కోరారు.
ఆగస్టు 15న పేదల కల సాకారం:
వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ పేదలకు శుభవార్త వినిపించారు. ఆగస్టు 15న 30లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రతిపక్ష నేతలు అడ్డుకుంటున్నారని వాపోయారు. కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అన్యాయమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాయో చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం అన్నారు. కచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీనే ఏపీలో పేదలకు స్వాతంత్ర్యం వస్తుందని, దేవుడి దయతో ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నట్టు జగన్ చెప్పారు. దేవుడు, ప్రజల దీవెనతో ఆ కార్యక్రమం జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నా అని జగన్ చెప్పారు.
సీఎం జగన్ కామెంట్స్:
* ఇబ్రహీంపట్నంలో 71వ వన మహోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
* జగనన్న పచ్చ తోరణం కింద రాష్ట్రంలో 20కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం
* పేదలకు లే అవుట్లు వేసిన ప్రాంగణంలో మొక్కలు నాటిన సీఎం
* 33 ఎకరాల లేఔట్ లో 1600 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగింది
* ఎకరా 3 కోట్ల రూపాయలు ఉన్నా మాట కోసం పేదలకు ఫ్లాట్లు ఇస్తున్నాం
* సుప్రీంకోర్టులో టీడీపీ నేతలు కేసులు వేసి పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు
* పేదలకు ప్రభుత్వం ఇళ్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది
* రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైన రాజకీయం చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలి
* దేవుడి దయ ఉంటే 30లక్షల మందికి ఆగస్టు 15వ తేదీన ఫ్లాట్లు కేటాయిస్తాం
* స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తాం
* అర్హత ఉండి ఇళ్లు రానివారు దరఖాస్తు చేసుకుంటే… తప్పకుండా స్థలం కేటాయిస్తాం
* రాష్ట్రంలో 17వేల లేఔట్లు వేసి 30లక్షల మంది పేదలకు ఫ్లాట్లు ఇస్తున్నాం
* ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలిస్తున్నాం
* అన్ని చోట్ల ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం
* రాష్ట్రవ్యాప్తంగా 20కోట్ల మొక్కల నాటాలని నిర్ణయించాం
* ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించేలా కృషి చేయాలి
* మొక్కలు నాటి.. వాటిని కాపాతామని.. పచ్చదనాన్ని వెల్లివెరిసేలా చేస్తామని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేస్తామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించిన సీఎం జగన్