ప్రజా కృతజ్ఞత సభ : హుజూర్ నగర్ గులాబీ మయం

  • Publish Date - October 26, 2019 / 07:44 AM IST

హుజూర్ నగర్ గులాబీ మయంగా మారిపోయింది. సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ ప్రజాకృతజ్ఞత సభ నిర్వహించనుంది. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో హుజూర్‌నగర్‌ వెళుతున్నారు. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వందలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించడానికి రెడీ అయ్యారు. పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ దగ్గర సీఎం కాన్వాయ్‌కు మంత్రి మల్లారెడ్డి ఘన స్వాగతం పలుకనున్నారు. 

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకున్న టీఆర్ఎస్.. కృతజ్ఞతగా అక్కడ భారీ బహిరంగ సభ తలపెట్టిన సంగతి తెలిసిందే. భారీ విజయాన్ని కట్టబెట్టిన హుజూర్‌నగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలపనున్నారు. ఈ సభా వేదిక నుంచి.. ప్రజలకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు హుజూర్‌నగర్  సెగ్మెంట్ అభివృద్ధి డిక్లరేషన్‌ను ప్రకటించబోతున్నారు. అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపించబోతున్నారు. మొత్తం లక్ష మందిని సభకు తరలించాలని టీఆర్ఎస్ వర్గాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా కొందరు మంత్రులు అక్కడే ఉండి ఏర్పాట్లలో తలమునకలయ్యారు.  

సీఎం కేసీఆర్ పర్యటనతో టీఆర్ఎస్‌ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. పలుచోట్ల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. చౌటుప్పల్‌లో పార్టీ జెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కేసీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. 
Read More : ఏం జరుగబోతోంది : ఆర్టీసీ జేఏసీ నేతలకు చర్చల పిలుపు