Congress has given clarity on alliances in generl elections
2024 General Polls: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. పొత్తులతోనే 2024 ఎన్నికల్ని ఎదుర్కోనున్నట్లు ఆ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే శనివారం స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో రాజ్యాంగంపైనా, ప్రజాస్వామిక విలువలపై నిత్యం దాడి జరుగుతోందని మండిపడ్డారు. దేశ సరిహద్దుల్లో చైనా నుంచి ముప్పు పొంచి ఉందని, దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగ,రైతు సమస్యలు పెరుగుతున్నాయని, ఇంతటి కఠినమైన స్థితిలోకి దేశాన్ని నెట్టింది మోదీ ప్రభుత్వమేనని ఖర్గే దుయ్యబట్టారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సమర్థమైన నాయకత్వాన్ని అందించగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని ఖర్గే అన్నారు.
2004 నుంచి 2014 వరకు భావసారుప్యం కలిగిన పార్టీతో కలిసి దేశానికి ఏవిధంగా సేవ చేశామో.. అదే తరహాలో మరోసారి అలాంటి పార్టీలతో కలిసి ప్రజావ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఖర్గే అన్నారు. ఢిల్లీలో ఉన్నది పేదల వ్యతిరేక ప్రభుత్వమని, అది ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందని విమర్శించారు. మోదీ ప్రజలకు ప్రధాన సేవక్ కాదని, కేవలం తన స్నేహితుల ప్రయోజనం కోసం పని చేసే ప్రధాన సేవక్ అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు బిజెపి కుట్ర చేస్తుంటే, దేశాన్ని ఏకం చేసేందకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఖర్గే అన్నారు.