ఎన్నికల కూత కూసిందో లేదో..అప్పుడే తెలంగాణ కాంగ్రెస్‌కు మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ చెందిన నేతలు ఒక్కొక్కరుగా ‘చేయి’ ఇస్తున్నారు. చేయి వద్దు..కారు ముద్దు అంటున్నారు. దీనితో అసెంబ్లీలో క్రమక్రమంగా బలం పడిపోతుండగా గులాబీ మెజార్టీ అధికమౌతూ వస్తోంది. తాజాగా మార్చి 10వ తేదీ ఆదివారం సాయంత్రం ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు వెల్లడించారు.
అత్యంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి…ఏకంగా ఎమ్మెల్యేగా హరిప్రియ గెలుపొందారు. ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల సమయంలో ఈమె టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ తీవ్ర నిరుత్సాహంలో పడిపోయింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు ఉన్న విజన్ గొప్పదని, తమ గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్‌లో చేరడమే పరిష్కారమని ఎమ్మెల్యే హరిప్రియ వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ బలం 16కు పడిపోయింది. తాజాగా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ కూడా పార్టీకి గుడ్ బై చెప్పడంతో..శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 15కు చేరుకుంది.