తెలంగాణను కరోనా భయం పట్టుకుంది. ఐటీ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఐటీ సెక్టార్‌లో కలకలం చెలరేగింది. మరోవైపు ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా వైద్యానికి చర్యలు తీసుకుంటోంది. కరోనా రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఈటల ప్రకటించారు.
రెండు వారాల క్రితం ఇటలీ వెళ్లి వచ్చిన ఉద్యోగికి పాజిటివ్ లక్షణాలు రావడంతో మైండ్‌స్పేస్‌లోని ఓ కార్యాలయాన్ని ఆ కంపెనీ మూసేసింది. ప్రస్తుతం ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రిపోర్ట్ కోసం శాంపిల్స్‌ను పూణెకు పంపారు. గురువారం రిపోర్ట్ రానుంది.(రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ ; విద్యాశాఖ కీలక నిర్ణయం)
ముందు జాగ్రత్తగా మైండ్‌స్పేస్‌లోని ఓ భవనాన్ని ఖాళీ చేయించి, వైరస్ నిర్మూలనా చర్యలు చేపట్టారు. అయితే మైండ్‌స్పేస్ అంతా ఖాళీ అవుతోందంటూ పుకార్లు పుట్టడంతో… ఐటీ సెక్టార్‌లో ఒక్కసారిగా ఆందోళన మొదలయ్యింది. చాలామంది ఐటీ ఉద్యోగులు గాంధీ ఆస్పత్రికి క్యూ కట్టి టెస్టులకు శాంపిల్స్ ఇచ్చారు. వీరితో పాటు మొత్తం 220 మందికి పైగా గాంధీ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకున్నారు.
వదంతులు వ్యాప్తి చేయొద్దు :- ఈటల
కరోనా వైరస్ పట్ల వదంతులను వ్యాప్తి చేయొద్దని మంత్రి ఈటల కోరారు. కనీస జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ ప్రాణాంతకం కాదన్నారు. తెలంగాణలో 24 గంటలు మానిటరింగ్ చేస్తామన్నారు. కరోనా నియంత్రణ కోసం ప్రత్యేకంగా నలుగురు ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. గాంధీ ఆస్పత్రిలోనే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా టెస్టులు చేయించుకోవచ్చన్నారు. వైరస్ ఉన్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ తుంపరాలు నేరుగా ఇతరుల నోట్లోనో, కంట్లోనో పడితేనే వైరస్ వ్యాపిస్తుందన్నారు.
నిలకడగా సాప్ట్ వేర్ ఇంజినీర్ ఆరోగ్యం :-
తెలంగాణలో కరోనా వేగంగా వ్యాప్తిస్తోందన్న పుకార్లను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ కొట్టిపారేశారు. కరోనా బాధితుడు కలిసిన 47 మందికీ పరీక్షలు నిర్వహించామని… వారిలో 45 మందికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని స్పష్టం చేశారు. మిగతా ఇద్దరి శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపించామని… గురువారం నివేదిక వస్తుందని వెల్లడించారు. అలాగే కరోనా బారినపడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆరోగ్యం నిలకడగా ఉందని… అతడు వేగంగా కోలుకుంటున్నాడని శ్రీనివాస్ తెలిపారు.
తప్పుడు మెసేజ్‌లు చేస్తే కఠిన చర్యలు – సీపీ సజ్జనార్
కరోనాపై తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. కరోనాపై తప్పుడు వార్తలతో పుకార్లు రేపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైందని చెప్పారు. మైండ్‌స్పేస్ బిల్డింగ్‌లో కేవలం ఒక్క ఫ్లోర్ మాత్రమే ఖాళీ చేయించామన్నారు. మిగతా ఆఫీసులన్నీ యథావిధిగా పనిచేస్తాయని చెప్పారు.
See Also | “బీజేపీ ఛీ ఛీ ” పేరుతో మమతా బెనర్జీ ర్యాలీ