కరీంనగర్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందా అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ముగ్గురికి వైరస్ సోకిందని తెలుస్తోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ వార్త జిల్లాలో కలకలం రేపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా భార్య, చిన్న కూతురుతో ఓ వ్యక్తి షాంఘై నగరానికి వెళ్లారు. ఇటీవలే తిరిగి కరీంనగర్ జిల్లాకు వచ్చారు.
తర్వాత..వీరు జలుబు, దగ్గుతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ వార్తలు గుప్పుమన్నాయి. భయపడిన ఆ కుటుంబం..వెంటనే హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి చేరుకున్నారు. వీరికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శాంపిల్స్‌లను పూణే నగరానికి పంపించారు. కానీ రిపోర్ట్స్ రావడానికి కొద్ది రోజులు సమయం పట్టనుంది. రిపోర్ట్స్ వస్తే కానీ..వారికి వైరస్ సోకిందా ? లేదా ? అనేది తెలియనుంది.
శాంపిల్స్ ఇక్కడే పరీక్షలు చేస్తామని..దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కోరింది. దీనికి కేంద్రం ఒకే చెప్పడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితర ఏర్పాట్లపై నిమగ్నమవుతున్నారు. పరీక్షలకు సంబంధించి శిక్షణ పొందాల్సి వస్తుందని, అందులో భాగంగా కొంతమందిని పూణేకు పంపించాలని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలనూ వణికిస్తోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్ నోడల్ సెంటర్‌లుగా గుర్తించారు. అనుమానితులను ఇక్కడ చికిత్స అందిస్తున్నారు.
Read More : డబ్బులను ఆదా చేయడానికి : మద్యం షాపుల అద్దెలపై రివర్స్ టెండరింగ్