Dalits treated as slaves for past 75 years, says former Bihar CM Jitan Ram Manjhi
Jitan Ram Manjhi: హిందూ సమాజంలో దళితులను బానిసలుగా చూస్తున్నారని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రాం మాంఝీ అన్నారు. పూజారి వర్గం వారిని అంటరానివారిగా చూస్తోందని, దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోందని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బిహార్‌లో ఉప ఎన్నికలు జరిగిన మొకామా, గోపాల్‌గంజ్ అసెంబ్లీ స్థానాల ఫలితాలపై ఆయన స్పందిస్తూ ఆ రెండు నియోజకవర్గాల్లో ఆర్‌జేడీ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధిస్తారని అన్నారు. ఈ రెండు స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా దళితులు ఆర్జేడీకి ఓటు వేశారని అన్నారు. హిందుత్వ భావజాలంతో రాజకీయాలు చేసే బీజేపీకి బుద్ధి చెప్పారని కూడా అన్నారు. ఈయన గతంలో ఎన్డీయే కూటమితో భాగస్వామి అన్న విషయం తెలిసిందే.
బీజేపీ రాజకీయాలపై మాంఝీ స్పందిస్తూ “నేను దళితులకు చెబుతూనే ఉన్నాను. మీరు హిందువులుగా భావిస్తుంటారు కానీ గత 75 సంవత్సరాలుగా మిమ్మల్ని బానిసలుగానే చూస్తున్నారు. మీ స్థలంలో వేడుకలు నిర్వహించడానికి పూజారులు ఇష్టపడరు. బయటికి ఎన్ని చెప్పినా, మీరు ఇచ్చే ఆహారాన్ని స్వీకరించడానికి సముఖంగా ఉండరు. మాంసం తినే, మద్యం సేవించే బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ వారికి మాత్రం అవేవీ తప్పుగా అనిపించవు’’ అని అన్నారు.
కాగా, మాంఝీ వ్యాఖ్యలపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన అంటే తమకు గౌరవమని, అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఆయన నుంచి వస్తాయని ఊహించలేదని బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ అన్నారు.
Munugode By Poll: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. ఉదయం 9 లోపే మొదటి ఫలితం