Lingojiguda By Poll
Lingojiguda by-poll : జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం వ్యవహారం బీజేపీలో కొత్త వివాదానికి కారణమైంది. లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు కలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండానే బీజేపీ బృందం మంత్రి కేటీఆర్‌ను కలిసినట్లు తెలుస్తోంది.
కనీస సమాచారం ఇవ్వకుండా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను కలవడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలిచే సీటు కోసం వాళ్లను అడగటం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లింగోజిగూడ అభ్యర్థి గెలుపు ఓటముల విషయం ఇతర మున్సిపాలిటీ ఎన్నికలపై ప్రభావం పడుతుందనే విషయంపై పార్టీలో చర్చిస్తున్నారు.
అటు లింగోజిగూడ డివిజన్‌కు జరగనున్న ఉప ఎన్నికలపై టీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్ ఉప ఎన్నికల్లో.. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది అధికార పార్టీ. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందడంతో.. ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ నేతలు చేసిన విజ్ఞప్తిపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
ఈ నెల 30న జరగనున్న ఉప ఎన్నికల్లో రమేశ్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం కేటీఆర్‌ని ప్రగతి భవన్‌లో కలిసి విజ్ఞప్తి చేసింది.
ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేశ్ గౌడ్ మరణించడం దురదృష్టకరమని.. వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టవద్దు అని బీజేపీ నుండి వచ్చిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి.. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.