దిశ నిందితుల రీ పోస్టుమార్టంను గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిందితుల శరీరాల్లో ఉన్న బుల్లెట్లపై ఒక క్లారిటీ వచ్చింది. ఎవరెవరి శరీరంలో ఎన్నెన్ని బుల్లెట్ గాయాలు ఉన్నాయో వైద్యులు గుర్తించారు. ఏ1 మహమ్మద్ ఆరిఫ్ శరీరంలో 4 బుల్లెట్ గాయాలను గుర్తించగా.. ఏ2 నిందితుడు చెన్నకేశవులు శరీరంలో 3 బుల్లెట్లు.. ఏ3 నవీన్ శరీరంలో 2 బుల్లెట్లు.. ఏ4 శివ శరీరంలో ఒక బులెట్‌ను వైద్యులు గుర్తించారు.
రీ పోస్టుమార్టంలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందంతో పాటు గాంధీ సూపరింటెండెంట్ కూడా పాల్గొన్నారు. నిందితుల కుటుంబ సభ్యులు సైతం గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. రీ పోస్టుమార్టం మొత్తాన్ని పోలీసులు వీడియో తీస్తున్నారు.
రీ పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు రిపోర్ట్‌ను షీల్డ్ కవర్‌లో అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. పోస్టుమార్టం తరువాత మృతదేహాలను గాంధీ వైద్యుల సమక్షంలో కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు. అయితే ఇవాళే అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబసభ్యులు సిద్ధమవుతున్నారు.
రీ పోస్టుమార్టంపై కూడా వాదనలు వినిపించారు. డిసెంబర్ 06వ తేదీన ఎన్ కౌంటర్ జరిగిన రోజే..మహబూబ్ నగర్ ఆస్పత్రిలో నలుగురు నిందితుల డెడ్ బాడీస్‌కు పోస్టుమార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. మృతదేహాల అప్పగింతపై నిర్ణయం తీసుకొనే వరకు..గాంధీ ఆస్పత్రిలోనే భద్రపరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణలతో పోస్టుమార్టం నిర్వహించామని ప్రభుత్వం కోర్టకు తెలిపింది. పోస్టుమార్టం చేసిన వైద్యుల వివరాలను కోర్టుకు ఏజీ తెలియచేశారు.
* 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి దిశా ఆచూకి తెలియలేదు.
* నవంబర్ 28వ తేదీ గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో దిశ దారుణ హత్యకు గురైంది.
* 24వ నేషనల్ హైవే దగ్గర ఓ వంతెన కింద దారుణంగా హత్య చేసి గుర్తు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు.
* హత్యకు ముందు అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. నిందితులంతా దిశా స్కూటీని పంక్చర్ చేసి డ్రామాలు ఆడారు. తామే పంక్చర్ వేయిస్తామని చెప్పి.. ఆమె మాటల్లో పెట్టి కిడ్నాప్ చేశారు.
* దిశా రేప్ అండ్ మర్డర్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
* నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
* కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని నవంబర్ 28న నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
* ఏ 1 మహ్మద్, ఏ 2 జొల్లు శివ, ఏ 3 చెన్నకేశవులు, ఏ 4 నవీన్ కుమార్‌లుగా వెల్లడించారు.
* నవంబర్ 29వ తేదీన షాద్ నగర్ పీఎస్‌లో నిందితులను విచారించారు.
* నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
* నవంబర్ 30న నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు.
* షాద్ నగర్ నుంచి నిందితులను జైలుకు తరలిస్తుండగా నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వారు.
* నిందితులను ఉరి తీయాలని డిమాండ్ వినిపించాయి.
* చంచల్ గూడకు నిందితులను తరలించాలని నిర్ణయించుకున్నారు.
* తొలుత అలాగే భావించినా చివరకు చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు.
* హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.
* మంత్రి కేటీఆర్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. చట్టాలను మార్చాలని విజ్ఞప్తి చేశారు.
* డిసెంబర్ 04వ తేదీన నిందితులను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది.
* డిసెంబర్ 05వ తేదీన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
* డిసెంబర్ 05వ తేదీన పోలీసుల విచారణ.
* నిందితుల సమాచారంతో దిశ సెల్ ఫోన్ స్వాధీనం.
* సంఘటనా స్థలంలో కీలక సాక్ష్యాలు సేకరించారు.
* డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం నలుగురు నిందితుల ఎన్ కౌంటర్.
Read More : రాజధానిలో వినూత్న నిరసనలు : అరగుండుతో..నవగ్రహాల చుట్టూ ప్రదిక్షణలు