విన్నాను.. ఇచ్చాను : 4లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు

  • Publish Date - November 7, 2019 / 07:04 AM IST

అగ్రిగోల్డ్ బాధితులకు తాము అండగా ఉంటామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. వీరిని ఏ మాత్రం పట్టించుకోకుండా..ప్రభుత్వ పెద్దలు దురాశకు లోనై..అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని చూశారని తెలిపారు. 2019, నవంబర్ 07వ తేదీ గురువారం గుంటూరు జిల్లాలో సీఎం జగన్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాధితులను రక్షించేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత..ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు చెప్పారు. జూన్ 10న జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే ఓ తీర్మానం చేసిందని, బడ్జెట్ సమావేశాల్లో కేటాయింపులు చేయడం జరిగిందన్నారు. ఐదు నెలలు కాకముందే.. 3 లక్షల 70 వేల మందికి రూ. 265 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. 46 లక్షల మంది రైతులకు తాము మేలు చేస్తున్నామని, రైతు భరోసా పథకం కింద వారిని ఆదుకుంటున్నామన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే..వారు కంగారు పడవద్దని..మిగిలిన వారికి కూడా న్యాయం చేస్తామని హామీనిచ్చారు. అర్హులైన డిపాజిటర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థలో నమోదు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్లు, ఎమ్మార్వో, గ్రామ సెక్రటేరియట్లకు వెళితే..నమోదుపై అవగాహన కల్పిస్తారన్నారు సీఎం జగన్. 

తొలి విడతగా.. 10 వేలలోపు డిపాజిట్లు చేసిన వారికి తొలుత చెల్లింపులు చేస్తారు. తర్వాతి దశలో 20వేల లోపు  డిపాజిట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఇలా ప్రతి బాధితుడికి న్యాయం చేసేలా కార్యాచరణ చేపట్టింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా 264 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల పరిధిలో ఒకేసారి చెల్లింపుల ద్వారా 3లక్షల 69వేల 655 మందికి న్యాయం జరుగుతోంది.

డిస్ట్రిక్ట్‌ లీగల్‌  సెల్‌ అథారిటీప్రతిపాదనల ప్రకారం జిల్లాల వారీగా ఈ సొమ్మును బాధితులకు అందచేయనున్నారు. అలాగే ఇరవై వేల రూపాయల లోపు ఉన్న మరో 4 లక్షలమంది డిపాజిట్‌దారులకు కూడా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు అధికారులు చెబుతున్నారు.