dubbaka byelections: ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయ సమీకరణాలు యమా రంజుగా మారుతున్నాయి. టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించడంతో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇందుకు ప్రతిగా టీఆర్ఎస్ కూడా వ్యూహాలు సిద్ధం చేసిందంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన నాగేశ్వర్‌రెడ్డికి గులాబీ కండువా కప్పేందుకు ప్లాన్ చేస్తోందని టాక్. ఆయన ఆ ఎన్నికల్లో 26వేల 799 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. దీంతో దుబ్బాకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
కేసీఆర్ తరహాలో కాంగ్రెస్ వ్యూహం:
సాధారణంగా ఎన్నికల ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇలాంటి ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలకు షాకులిస్తుంటారు. కానీ, ఈసారి కాంగ్రెస్ వ్యూహం పన్నింది. టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డికి గాలం వేసి సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీలో దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీకి నలుగురు నేతలు ఉత్సాహం చూపించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి పార్టీ టికెట్ దాదాపు ఖరారు కూడా అయ్యింది. కాకపోతే ఇదంతా కాంగ్రెస్ వ్యూహంలో భాగమేనంటున్నారు.
టికెట్ దొరకదని కాంగ్రెస్‌లోకి జంప్:
శ్రీనివాస్ రెడ్డిని త్వరగా పార్టీలోకి తీసుకువచ్చేందుకే వ్యూహాత్మకంగా నర్సారెడ్డి పేరును కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేట్ అయితే కాంగ్రెస్‌లో కూడా టికెట్ దొరకదనే ఉద్దేశంతో శ్రీనివాస్‌రెడ్డి జంపింగ్ అయిపోయారు. దుబ్బాక ఉప ఎన్నికను రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అనారోగ్యంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి చెందడంతో ఇప్పుడు ఆయన సతీమణి సుజాతను రంగంలోకి దించుతోంది.
కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ ప్లాన్:
కాంగ్రెస్ తరఫున నలుగురు క్యూలో ఉన్నప్పటికీ నర్సారెడ్డిని రంగంలోకి దించాలని ఫిక్సయిన తరుణంలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు ఆయనకే టికెట్ ఖరారు చేసింది. కాంగ్రెస్‌లో టికెట్ ఆశించి భంగపడిన ఒకరిద్దరు నేతలకు టీఆర్ఎస్ గాలం వేసిందంటున్నారు. వారిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన నాగేశ్వర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్‌కు షాకివ్వాలని ప్లాన్ చేసిందని టాక్. ఆయన చేరితే పార్టీకి మరింత ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
శ్రీనివాస్‌రెడ్డిని దూరం పెడుతూ వచ్చిన టీఆర్ఎస్:
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి టీఆర్ఎస్‌లో చేరారు. ముత్యంరెడ్డికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇస్తానని కేసీఆర్ ఆ సమయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. ఎన్నికల అనంతరం ముత్యంరెడ్డి అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి శ్రీనివాస్‌రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా దూరం పెడుతున్నారని ఆయన వర్గం అసంతృప్తితో ఉంది. రామలింగారెడ్డి మరణంతో శ్రీనివాస్‌రెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. టికెట్ తనకు వస్తుందని ఆశించారు. కానీ, అలా జరగకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిపోయారు.
ఇప్పుడు కాకపోతే మళ్లీ పోటీ చేసే అవకాశం రాదని కాంగ్రెస్ లోకి జంప్:
శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని టీఆర్ఎస్ ముఖ్య నేతల ద్వారా హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు కాకపోతే మళ్లీ పోటీ చేసే అవకాశం రాదని భావించిన శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారిపోయారని అంటున్నారు. కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నారు. నర్సారెడ్డి స్థానికేతరుడు కావడంతో శ్రీనివాస్‌రెడ్డి అయితే బెటర్ అని కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ వల వేసిందని చెబుతున్నారు. ఎన్నికలు జరిగే లోపు ఇంకెన్ని మార్పులు, చేరికలు ఉంటాయో చూడాల్సిందే.