పోలవరం భూమి ఇలాగే కుంగితే రాజమండ్రి వరకు ఊళ్లు కొట్టుకుపోతాయి : ఉండవల్లి

  • Publish Date - May 7, 2019 / 06:41 AM IST

విజయవాడ: పోలవరం ప్రాజెక్ట్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రమాదం ముంచుకొస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. ప్రాజెక్టు దగ్గర తరచూ భూమి కుంగిపోవటం చిన్నవిషయం కాదన్నారు. దాని ప్రభావం స్పిల్ వే పై ఉంటుందన్నారు. కాఫర్ డ్యాం నిర్మాణం వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారని, కాఫర్ డ్యాం ద్వారా నీళ్లు ఇవ్వటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

మంగళవారం (మే 7,2019) విజయవాడలో మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భూమి కుంగిపోవటం జరిగితే, డ్యాం కూలిపోతుందని, అప్పుడు పోలవరం నుంచి రాజమండ్రి వరకు ఉన్న గ్రామాలన్నీ కొట్టకుపోతాయని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిపుణులను పిలిపించి స్పిల్ వే నిర్మాణ పనులను, భూమి కుంగిపోవటంపై పరీక్షలు జరిపించాలని ఉండవల్లి సూచించారు.

విభజన చట్టం హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మించి ఇవ్వాలని, దానిపై చంద్రబాబు పోరాడకుండా ఇతర విషయాలపై ఆయన స్పందిస్తున్నారని ఉండవల్లి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2014 లెక్కల ప్రకారం పోలవరం నిధులు ఇస్తామని చెబుతోందని, విభజన చట్టంలో అలా లేదని ఉండవల్లి వివరించారు. పోలవరం ప్రాజెక్టుపై తనకున్న సందేహాలు తీర్చాలని చంద్రబాబును కోరితే ఇప్పటి వరకు ఆయన నా సందేహాలు తీర్చలేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు