ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం, గోపవరంలో ఎంపీటీసీ ఎన్నిక చిచ్చు రేపింది. టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకున్నారు. కత్తులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. చాలా మంది గాయపడ్డారు. గాయాలైన వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరిన్ని గొడవలు జరుగకుండా గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అసలేం జరిగింది :
వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలం, గోపవరంలో మే 14వ తేదీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓటింగ్ శాతం ఎలా ఉండబోతోంది ? ఎంత శాతం నమోదవుతుందనే దానిపై నేతలు అంచనా వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అనుచరులు తమకు అనుకూలంగా ఓటు వేయలేదని ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరులు భావించారు.
క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ మే 15వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో రెండు వర్గాలు కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. మీ వల్లే ఓడిపోతున్నాం అంటూ ఒకరు.. కాదు మీరే మోసం చేశారని మరొకరు ఇలా ఒకరిపై ఒకరు ఆగ్రహంతో దాడులకు తెగబడ్డారు.