తొలిసారి జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న పవన్, దీని వెనుక వ్యూహం ఉందా?

  • Publish Date - July 11, 2020 / 04:06 PM IST

ప్రశ్న క్లారిటీగా ఉంటేనే, జవాబు కూడా అంతే క్లారిటీగా ఉంటుంది. క్వశ్చన్ లో కన్ ఫ్యూజన్ ఉంటే, ఆన్సర్ లో క్లారిటీ మిస్ అవుతుంది. ప్రస్తుతం ప్రశ్నించే పార్టీలో అదే జరుగుతోంది. ప్రశ్నించే పార్టీ నాయకుడే ప్రశ్నగా మిగిలిపోతున్నాడు. ప్రభుత్వ నిర్ణయాలపై ఒక్కో సందర్భంలో ఒక్కో రీతిన అధినాయకుడు స్పందిస్తుండటంతో పార్టీ కేడర్ అయోమయంలో పడిపోతోంది.

బీజేపీతో జత కలిశాక పవన్ లో మార్పు:
రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తీరు అటు ఇటుగానే ఉంటోంది. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ ఉంటారనే అపవాదు ఉంది. ఏదైనా అంశం మీద ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్లీ చాలా రోజుల వరకూ దాని గురించి పట్టించుకోకపోవడం అలవాటు. ఇటీవల చాలా కాలం పాటు ఏ విషయంపైనా స్పందించకుండా ఉన్న పవన్‌.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ చర్యల మీద రెండు మూడు ప్రకటనలు చేశారు. ముఖ్యంగా బీజేపీతో జత కలసిన తర్వాత ఆయన రాజకీయాల మీద పెద్దగా కాన్‌సంట్రేట్‌ చేస్తున్నట్టుగా కనిపించడం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కూడా పెద్దగా ఏమీ చేపట్టడం లేదు. ఇతర నాయకులు కూడా ఎక్కడా ఏ విషయం మీదా స్పందించడం లేదు. పార్టీ అభిమానులు కూడా సైలెంట్‌ అయిపోయారు.

తొలిసారి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు:
తాజాగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. ప్రభుత్వానికి అనుకూలంగా రెండు ప్రకటనలు చేశారు. తొలిసారిగా జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ చేసిన ఆ ట్వీట్లు చూసి ఆ పార్టీ నేతలు కూడా కంగుతిన్నారట. మంచి పనులు చేస్తే ఎవరినైనా మెచ్చుకోవాల్సిందే. కాకపోతే రాజకీయాల్లో ఎవరైనా మంచి పని పనులు చేసినప్పుడు.. వాటిని వారి ప్రత్యర్థులు మెచ్చుకునే సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయి. కానీ, పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. అనేకసార్లు ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పవన్… రాష్ట్రంలో అంబులెన్స్‌లను ప్రవేశపెట్టినప్పుడు మాత్రం ప్రశంసించారు. కరోనా టెస్టులను ఎక్కువ సంఖ్యలో చేయడం పట్ల కూడా ఏపీ సర్కార్‌ను పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదనపై జనసేనాని విమర్శలు:
జగన్‌ను ఇలా మెచ్చుకోవడం వైసీపీకి ప్లస్‌ అయ్యిందనే చెప్పుకోవాలి. ఆ రెండు మెచ్చుకోళ్లకు విరుగుడుగా తాజాగా మూడు రాజధానుల ప్రతిపాదనపై మరోసారి వైసీపీ సర్కార్‌ను విమర్శించారు పవన్‌. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ ఇలా అంశాలవారీగా జగన్ సర్కార్‌పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడంపై రాజకీయవర్గాలతో పాటు జనసేన వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

చంద్రబాబు అలా, పవన్ ఇలా:
అంబులెన్స్‌లు, కరోనా టెస్టుల విషయంలో జగన్ సర్కార్‌ను పవన్‌ మెచ్చుకోగా… అంబులెన్స్‌ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని, కరోనా టెస్టుల విషయంలో నాణ్యత సరిగ్గా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శిస్తున్నారు. టీడీపీ చేసిన విమర్శలే పవన్ సైతం చేయాలనేం లేదు. కాకపోతే ఈ అంశాల్లో ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం ద్వారా వారికి కూడా ఓ అవకాశం ఇచ్చినట్టు అవుతుందనే వాదన వినిపిస్తోంది. పవన్‌ మెచ్చుకున్న రెండు అంశాల విషయంలో పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదంటున్నారు. ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తాం.. తప్పు చేస్తే ప్రశ్నిస్తామని పవన్ ఎఫ్పుడో చెప్పారని జనసేన కార్యకర్తలు అంటున్నారు.

జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం వెనుక వ్యూహం ఉందా?
దీని వెనుక పవన్‌ వ్యూహం ఉందని అంటున్నారు. ఇలా కొన్ని అంశాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల… టీడీపీ, జనసేన ఒకటే అని వైసీపీ చేసే విమర్శలకు కూడా చెక్ చెప్పినట్టు అవుతుందని చెబుతున్నారు. కాకపోతే, పవన్‌ జతకలసిన బీజేపీ మాత్రం అంబులెన్స్‌ల విషయంలో కొన్ని విమర్శలు చేసింది. దీనిపై సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ లేఖ కూడా రాశారు. ఈ సమయంలో పవన్‌ ఇలా వ్యాఖ్యానించడంతో కన్‌ఫ్యూజన్‌ నెలకొంది. మరి, పవన్ కల్యాణ్ ఏపీలో భిన్నమైన రాజకీయాలు చేస్తున్నారా? రాజకీయాలు తెలియక తికమకపడుతున్నారా? అన్నది మాత్రం చాలామందికి అంతుచిక్కడం లేదు.